ఎంవీఏ పిటీషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు 

తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహా వికాస్ అగాఢీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతే కాకుండా ఈ పిటిషన్‌ను జూలై 11న పరిశీలిస్తామని సుప్రీం శుక్రవారం తెలిపింది. 
 
16 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్ర అసెంబ్లీలలో విచారణ జరుతుగున్న నేపథ్యంలో ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వారు అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సస్సెండ్ చేయాలని కోరుతూ సుప్రీంలో ఎంవీఏ కూటమి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. 
 
ఈ విషయమై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్‌లో ఎంవీఏ విజ్ణప్తి చేసింది. అనర్హత వేటు వేయాలని ఎంవీఏ పేర్కొన్న ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి  ఏక్‌నాథ్ షిండే కూడా ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబెల్ ఎమ్మెల్యేల కూటమి నేత ఏక్‌నాథ్ షిండే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఫిరాయింపు పాల్పడిన ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత వేటు విషయం తేలేంత వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్‌ చేయాలని కోరుతూ శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు పిటిషన్‌ దాఖలు చేశారు. ఏక్‌నాథ్‌ షిండే వర్గం తిరుగుబాటు చేసినప్పటికీ.. శివసేన అసలైన నాయకత్వం తమతోనే ఉందని, 2018లో జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఉద్ధవ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.
 ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియజేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు… ఇప్పటి వరకు దాఖలైన అన్ని పిటిషన్లపై జులై 11న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తమపై అనర్హత వేటు వేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు జులై 12 వరకు గడువును కల్పించింది. ఈ పిటిషన్‌ కూడా ఆ రోజున విచారించనుంది.
 కాగా, జూలై నాల్గవ తేదీన ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేయాలంటూ ఎంవీఏ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం.
జూలై 3వ తేదీని మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. నిజానికి ఈ సమావేశాలు 2,3 తేదీల్లో జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి.