నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ -సీ53

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ 55వ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియ లిమిటెడ్ ద్వారా పూర్తి వాణిజ్య పరంగా నిర్వహించిన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ఇస్రో నమ్మకాన్ని పీఎస్ఎల్వీ మరోసారి నిజం చేసింది. 
 
ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి సింగపూర్ కు  చెందిన 365 కిలోల బరువు కలిగిన డీఎస్-ఈఓ, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్ర వేత్తలు తయారు చేసిన 155 కిలోల బరువు కలిగిన న్యూసార్, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ రూపొందించిన 2.8 కిలోల బరువు కలిగిన స్కూబ్ -1 ఉపగ్రహాలను 570 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.
 
 ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియను బుధవారం సాయంత్రం 4.02గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించారు. కౌంటెన్ సమయంలోనే రాకెట్లో నింధనాన్ని నింపే పక్రియలో నిమగ్నమైన శాస్త్ర వేత్తలు ఎలాంటి అవాతంరాలు చోటుచేసుకోకుండా విజయవంతంగా ప్రయోగాన్ని చేపట్టాలన్న ధృడ నిశ్చయంతో అడుగులు వేశారు. 
 
గురువారం సాయంత్రం 6.02గంటలకు కౌంట్ డౌన్ 0కు చేరుకున్న వెంటనే శ్రీహరికోటలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి తన గమనాన్ని ప్రారంభించిన పీఎస్ఎల్వీ -సీ53 ఒక్కో దశను దాటుకుంటూ 19 నిమిషాలలో రోదసిలోకి మూడు విదేశీ ఉపగ్రహాలను విడిచి పెట్టి తన పనిని విజయవంతంగా ముగించింది.
పీఎస్ఎల్వీ -సీ53 రాకెట్ విజయవంతంగా ప్రయోగించడంతో షార్లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాధ్ ప్రయోగం విజయవంతం అయిన అనంతరం ప్రసంగించారు. పీఎస్ఎల్పీ -53 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడంతో పాటు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రయోగం విజయవంతానికి కృషి చేసిన శాస్త్ర వేత్తలను ఆయన అభినందించారు.