చిన్న ఆలయాల నిర్వహణ ఇక అర్చకులదే 

ఆంధ్ర ప్రదేశ్ లోని చిన్న ఆలయాల అనువంశిక ధర్మకర్తలు, అర్చకులకు దేవాదాయ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై చిన్న ఆలయాల నిర్వహణ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల నుంచి ఏ విధమైన కాంట్రిబ్యూషన్‌ వసూలు చేయరాదంటూ దేవదాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌ లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 దేవదాయశాఖ నిర్ణయంతో రాష్ట్రంలోని గుర్తించిన 3,200 ఆలయాలకు ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలోని ఆలయాల నుంచి సీజీఎఫ్‌ (కామన్‌ జనరల్‌ ఫండ్‌), ఈఏఎఫ్‌ (ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫండ్‌), ఆడిట్‌ ఫీజు తదితర పద్దుల కింద 18 శాతం వరకు వసూలు చేస్తారు. పెద్ద ఆలయాలకు ఈ తరహా వసూళ్లు భారం కానప్పటికీ చిన్న ఆలయాలకు ఫెను భారంగా మారింది.
ధూపదీప నైవేద్యాలకు సైతం అనేక ఆలయాలు నోచుకోలేదు. పైగా పలు ఆలయాల అర్చకులు, ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించని స్థితిలో నెలల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై గతంలో అర్చక సంఘాలు అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయించాయి.
అప్పట్లో అర్చక సంఘాలకు అనుకూల తీర్పులు వచ్చినప్పటికీ దేవదాయశాఖ అధికారులు అప్పీళ్ల పేరిట కాలయాపన చేశారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర హైకోర్టు మరోసారి తీర్పును వెలువరించింది. తీర్పు అమలుకు గడువు కూడా విధించింది. హై కోర్టు ఆదేశాల నేపధ్యంలో రాష్ట్రంలోని రూ.5లక్షల లోపు ఆదాయమున్న ఆలయాల జాబితాను రెండు నెలల కిందట అధికారులు రూపొందించారు.