సికింద్రాబాద్‌ అల్లర్లలో యావజ్జీవ కారాగార శిక్ష అవకాశం

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే కేసుల్లో శిక్ష పడ్డవారికి భవిష్యత్‌లో ప్రభుత్వోద్యోగాలు రావని స్పష్టం చేశారు. సుమారు 2 వేల మంది ఆందోళనకారులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారని పేర్కొంటూ వారిని కొందరు రెచ్చగొట్టారని వివరించారు.

ఈ నెల 17న జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు రైల్వేస్టేషన్‌ మూడో గేటు నుంచి 300 మంది దాకా వచ్చారని, వారి చేతుల్లో కర్రలు, రాడ్లు ఉన్నట్లు, కొందరు పెట్రోల్‌ బాటిళ్లతో వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా ఉందని తెలిపారు.

‘‘9.30కల్లా మొత్తం 2 వేల మంది జమయ్యారు. వీరంతా తెలంగాణ వారే. రాతపరీక్ష కోసం ఎదురుచూస్తున్నవారే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సీసీ కెమెరాలు, స్టాళ్లు, డిస్‌ప్లే బోర్డులను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫాంలపై ఈస్ట్‌కోస్ట్‌, అజంతా, దానాపూర్‌ ఎక్స్‌ప్రె్‌సలు ఉన్నాయి. 4 బోగీలకు నిప్పంటించారు.   58 అద్దాలను పగులగొట్టారు. రైళ్లలో ఉన్నవారు భయంతో బయటకు వెళ్లిపోయారు’’ అని అనురాధ వివరించారు.

ఆందోళనకారులను అడ్డుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌), గవర్నమెంట్‌ రైల్వే పోలీసు(జీఆర్‌పీ) బృందాలు ప్రయత్నించాయని, కానీ  వారు పట్టాలపై ఉన్న రాళ్లతో వారిపై దాడులు చేశారని ఆమె తెలిపారు.

‘‘స్టేషన్‌లోని లోకో ఇంజన్‌లలో 4 వేల లీటర్ల ఇంధనం, 3 వేల లీటర్ల ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ ఉన్నాయి. వాటికి నిప్పు పెట్టేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో ఆర్పీఎఫ్‌ బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చింది. మొత్తం 20 రౌండ్ల కాల్పులు జరగ్గా.. ఒకటి మాత్రమే ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ నుంచి ప్రయోగించినది. మిగతావన్నీ పెల్లెట్లే. లోకో ఇంజన్లకు నిప్పు పెట్టి ఉంటే.. భారీ పేలుడు, విధ్వంసం జరిగేది’’ అని ఆమె పేర్కొన్నారు.

విధ్వంసకాండ వెనక ఆర్మీ కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని, వారిని కూడా అరెస్టు చేస్తామని అనురాధ వెల్లడించారు. ‘‘ఆందోళనకారులు పలు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఈ కుట్ర పన్నారు. వాటిల్లో రైల్వేస్టేషన్‌ బ్లాక్‌ గ్రూప్‌, ఇండియన్‌ ఆర్మీ గ్రూప్‌, హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌ గ్రూప్‌, చలో సికింద్రాబాద్‌ ఏఆర్‌వో-3 గ్రూప్‌, ఆర్మీ జీడీ 2021 మార్చ్‌ ర్యాలీ, సీఈఈ సోల్జర్స్‌ గ్రూప్‌, సోల్జర్స్‌-టు-డై గ్రూపులను గుర్తించాం. దాడి సమయంలోని ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. స్టేషన్‌లోకి వచ్చిన 1500 మందిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నాం’’ అని వివరించారు.

బిహార్‌లో రైళ్లను తగులబెట్టినట్లుగానే.. ఇక్కడా విధ్వంసం సృష్టించాలని ఈ గ్రూపుల చాటింగ్‌లో ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌ చేశామని వెల్లడించారు.

కాగా, సికింద్రాబాద్‌ ఘటనలో అగ్నికి ఆహుతైన పార్సిళ్లకు సంబంధించిన పరిహారంపై రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయా రైళ్లలోని పార్సిల్‌ వ్యాన్లలో ఎక్కించిన 8 మోటార్‌సైకిళ్లు, బెడ్‌రోల్స్‌తోపాటు వివిధ రకాల వస్తువులను పంపించిన వ్యాపారులు, ఇతరుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

బైౖకులు పోగొట్టుకున్న వారి నుంచి ఆర్‌సీ బుక్‌లను తీసుకుంటున్నారు. వాటికి మార్కెట్‌ విలువ ఆధారంగా చెల్లింపులు చేస్తారని.. కొత్త మోడల్‌కు.. పర్సంటేజ్‌ చార్జ్‌ ఆన్‌ ఎక్సెస్‌ వాల్యూ (పీసీఓఈవీ) మేరకు పరిహారం ఉంటుందన్నారు.