ప్రగతి మైదాన్ ప్రాజెక్ట్ లో 20 శాతం వాటా చెల్లించని ఢిల్లీ ప్రభుత్వం

రూ 920 కోట్లతో చేపట్టిన ప్రగతి మైదాన్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ లో 20 శాతం వాటా ఢిల్లీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, కానీ చెల్లించలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి పని చేయలేదని ధ్వజమెత్తారు.
కాగా, రూ 920 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ప్రగతి మైదాన్‌లో అభివృద్ధి చేస్తున్న ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌కు అవాంతరాలు లేకుండా, సాఫీగా సాగేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరం కానుంది.
ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉండగా, దీనిలో ఢిల్లీ ప్రభుత్వం మొత్తం వ్యయంలో 20 శాతం చెల్లించాల్సి ఉంది. అయితే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం వారి వాటాను ఇవ్వలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పూర్తి చేసింది అని పీయూష్ గోయల్ తెలిపారు.
దేశ రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి పని చేయలేదని, కానీ, ఢిల్లీ వాసులకు కేంద్రం పెద్ద ఊరటనిచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సొరంగం వల్ల ఏటా రూ.100 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
 ప్రయాణికులు ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేయగలుగుతారు. అదనంగా ఈ సొరంగం ఐదు లక్షల చెట్లకు సమానమైన కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. భారతీయ సంస్కృతికి సంబంధించిన రంగు రంగుల చిత్రాలను సొరంగం గోడలపై చిత్రీకరిస్తారు. అధునాతన ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా సొరంగంలో అమర్చారు అని పీయూష్ గోయల్ చెప్పారు.