డిజిపిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాం 

డిజిపిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాం 
డిజిపిని కలిసేందుకు పదేపదే కోరుతున్నా అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదని, శనివారం ఉదయంలోపు ఇవ్వకపోతే కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో కొద్దిమంది అధికారులు బాధ్యత మరచి ప్రవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసిపి ప్రభుత్వం ప్రజలకు కులాలు, వర్గాల వారీ విభజిస్తోందని పేర్కొంటూ ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. 
 
కోనసీమ విషయంలో కుట్ర కోణం కనిపిస్తోందని, కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసును పక్కదారి పట్టించేందుకే అమలాపురం ఘటన సృష్టించారని ఆరోపించారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సిద్ధాంతాలకు ఆశయాలకు వ్యతిరేకంగా అక్కడ ఘర్షణలు సృష్టించారని విమర్శించారు. 
 
అల్లర్ల వల్ల వర్కుఫ్రమ్‌ హోం చేసుకునేవారు ఇంటర్నెట్‌ సదుపాయం లేక యానాం, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి విశ్వరూప్‌ హుందాతనం కలిగిన వ్యక్తని పేర్కొంటూ ప్రభుత్వ కుట్రలో ఆయన బాధితుడిగా మారారేమో అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. అల్లర్లను ఖండించని మంత్రుల బృందం బస్సుయాత్రకు బయలుదేరడం విడ్డూరంగా ఉందని వివరించారు. 
 
కాగా, బిజెపితో పొత్తుపై ప్రశ్నించగా తానెప్పుడూ పొత్తుల గురించి మాట్లాడలేదని తెలిపారు. మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని, అందువల్లే ఓటు చీలనివ్వనని చెప్పానని చెప్పారు. పొత్తులంటే అన్ని అవకాశాలూ కలిసి రావాలని చెబుతూ  రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దాలంటే పొత్తులపై అందరూ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు తొలుత తనకు తెలియదని, కేంద్ర నాయకులతోనే పరిచయమని,అనంతరం రాష్ట్ర నేతలు పరిచయం అయ్యారని వివరించారు. మతపరమైన కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలూ పాల్గొనడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ యువజనులకు రైతులకు, శ్రామికులకు న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. 
 
సిపిఎస్‌పై చెప్పిన మాట చేయలేదని చెబుతూ  వైసిపి అధికారంలో ఉన్నంత కాలం పోలవరం ప్రాజెక్టు పూర్తవదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  కేంద్రం ఇచ్చిన నిధులు వేరేచోట ఖర్చు పెట్టారని కేంద్రం తెలిపిందని విమర్శించారు. పదవులు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరగదని తెలిపారు. వారికి అవకాశాలు కల్పించడం ద్వారానే జరుగుతుందని పేర్కొన్నారు. అల్లర్ల నేపథ్యంలో గోదావరి జిల్లాలను వైసిపి మర్చిపోవచ్చని చెప్పారు. 
ఏపీలో ఘర్షణలు సృష్టించాలనే కుట్ర జరుగుతోందని పేర్కొంటూ సమస్యలను పక్కదారిపట్టించడమే వైసీపీ సర్కార్‌ విధానం అని,  మండిపడ్డారు. ఏపీలో మళ్లీ వైసీపీ సర్కార్‌ వస్తే అరాచకమేనని.. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని హెచ్చరించారు.  వై ఎస్ ఆర్  ప్రభుత్వంలో `వై’ అంటే యువజనులకు ఉపాధి లేదని, `ఎస్’ అంటూ శ్రామికులకు ఉన్నపని తీసేశారని, `ఆర్’  అంటే రైతులకు మద్దతుధర లేదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.