ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించవలసిందే 

ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  స్పష్టం చేశారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో పటిష్ట పరిచాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. 
 
రెండవ గ్లోబల్ కరోనా సదస్సును ఉద్దేశించి వర్చువల్‌గా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజా కేంద్రక వ్యూహాన్ని రూపొందించాలని ప్రధాని సూచించారు. కరోనా  సవాళ్లను అధిగమించే చర్యలకు ప్రస్తుత సదస్సు మార్గం చూపాలని, పటిష్టమైన విధానాలను రూపొందించాలని ఆయన అభిలాష వ్యక్తం చేశారు.
 
కరోనామహమ్మారి ఇంకా జనజీవనానికి ఇబ్బందులు కలగజేస్తూనే ఉందని, సప్లయ్ చెయిన్‌ను కూడా దెబ్బతీస్తోందని. బహిరంగ సమాజాల మనుగడకు పరీక్షగా మారిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా హెచ్చరించారు. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినైజేషన్ జరిగిందని ప్రస్తావించారు. 
 
భారతీయ పెద్ద వయస్కుల్లో 90 శాతం మంది సంపూర్ణ వ్యాక్సినేషన్ పొందారని చెప్పారు. కరోనాపై పోరాటం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు భారత్‌లో అనేక సాంప్రదాయక ఔషధాలను వినియోగించారని పేర్కొన్నారు. 
 
ఈ విషయంలో ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయక కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సారధ్యంలో జరిగిన మొదటి గ్లోబల్ కొవిడ్ సదస్సులో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.