కేసీఆర్ అవినీతిపై అమిత్ షాకు పాల్ ఫిర్యాదు 

 తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అవినీతి, తనపై జరిగిన దాడి గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ వెల్లడించారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి షాతో భేటీ అయ్యారు. 
 
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సందర్భంగా శనివారం జరిగే బహిరంగ సభలో పాల్గొనడానికి రెండు రోజుల ముందు అమిత్ షాను పాల్ గురువారం రాత్రి కలవడం ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను అంతకు రెండు రోజుల ముందు హైదరాబాద్ లో పాల్ కలవడం గమనార్హం. 
 
ఈ రెండు సమావేశాలలో కేసీఆర్ పై ఫిర్యాదులతోనే కలిశారు. కేసీఆర్ పాలనను ఎండగడుతూ తెలంగాణాలో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు బిజెపి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న సమయంలో అంతర్జాతీయంగా పేరొందిన ఓ ప్రముఖ క్రైస్తవ నేతతో ఈ సమావేశాలు జరగడం రాజకీయ వర్గాలకు ఆసక్తి కలిగిస్తున్నది. 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అన్యాయం, అక్రమాలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తనపై దాడి చేయించారని, దాని పరిణామాలు త్వరలో చూస్తారని హెచ్చరించారు. తనపై జరిగిన దాడిని అమిత్‌ షా ఖండించారని పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయని పాల్  ఆరోపించారు. తెలంగాణ డీజీపీ తనకు సమయం ఇవ్వలేదని, కానీ కేంద్ర హోం మంత్రి అడగ్గానే సమయం ఇచ్చారని తెలిపారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు తనకు ఇచ్చే గౌరవాన్ని అందరూ చూడాలని సూచించారు. తాను అమిత్ షాకు ఫిర్యాదు ఇచ్చిన ఫలితం ఏమిటో  త్వరలో తెలుస్తుందని ఈ సందర్భంగా నర్మగర్భంగా చెప్పారు. 
 
తనపై దాడులు చేయించిన కేసీఆర్ పర్యవసానాలు సిద్ధం కావాలని కూడా హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంభం జరిపిన అక్రమాలపై తగు దర్యాప్తు జరిపితే వారు జైలుకు వెళ్లడం ఖాయం అంటూ స్పష్టం చేశారు.  తనపై తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న దాడుల దృష్ట్యా తనకు కేంద్ర ప్రభుత్వం తగు భద్రత కల్పించాలని ఆయన అమిత్ షాను కోరినట్లు తెలుస్తున్నది. 
 
కాగా… దేశం శ్రీలంకలా మారుతుందని పాల్‌ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.8 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు రూ.4.5లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా పోటీ చేస్తుందని పాల  ప్రకటించారు. కేంద్ర మంత్రి పురుషోత్తమ్‌ రూపాలాను కూడా కలిసి తెలంగాణ పరిస్థితులపై కేఏ పాల్‌ చర్చించారు.
గత ఎన్నికల్లో ఏపీలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టడమే కాకుండా, పాల్ స్వయంగా నరసాపురం నుండి లోక్ సభకు పోటీ చేశారు. కానీ ఏ నియోజకవర్గంలో ఆయన పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏపీతో పాటు తెలంగాణాలో సహితం అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.