మాస్క్ ధరించడం ఇక కేరళలో తప్పనిసరి

మాస్క్ ధరించడం ఇక కేరళలో తప్పనిసరి
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. తాజాగా మాస్క్‌ ధరించని వారికి, కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు విధించనున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. 
 
డిఎం యాక్ట్‌ – (విపత్తు నిర్వహణ) 2005లో సెక్షన్‌ 20 (3) ప్రకారం.. శిక్షలు విధించనున్నటు ్ల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో అన్ని బహిరంగ ప్రదేశాలు, సమావేశాలు, కార్యాలయాలు, రవాణా సమయంలో కూడా ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలి. 
 
మాస్కులు ధరించని వారికి డిఎం చట్టం అమలులో ఉన్న ఇతర సంబంధిత చట్టాల నిబంధనల ప్రకారం.. శిక్షలు విధించడం జరుగుతుందని గవర్నర్‌ ఆదేశం మేరకు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి.పి జారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. 
 
మరోవంక, తమిళనాడులో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఐఐటీ మద్రాసులో పాజిటివ్‌ కేసులు 111కి చేరుకున్నాయి. ఒకేచోట కేసులు కేంద్రీకృతమై ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో ఇక్కడ వైద్య బృందాలు తిష్టవేసి కరోనా పరీక్షలు చేస్తూ విస్తృతం చేశారు. 
 
అయితే,  తమిళనాడులో మళ్లీ కరోనా లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉండదని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాధాకృష్ణన్‌ స్పష్టం చేశారు. వదంతులను నమ్మొద్దని సూచించారు. ప్రజలు కరోనా పరిస్థితుల గురించి భయపడాల్సిన పనిలేదు, నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో 29 జిల్లాల్లో కరోనా కేసులు లేవు, 9 జిల్లాల్లో చాలా స్పల్పంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి వెయ్యి మందిలో మూడు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. కరోనా కట్టుబాట్లపై మైక్రోప్లాన్‌ సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని వివరించారు.
తాజాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3,303 నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,68,799కు చేరింది. ఇందులో మొత్తం 4,25,28,126 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,693కి పెరిగింది. దేశవ్యాప్తంగా 2563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో 16,980 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,40,75,453 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.