
దేశ సమగ్రత, ఐక్యతల విషయంలో ఎటువంటి రాజీ ఉండరాదని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. విధుల్లో భాగంగా తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికీ ‘నేషన్ ఫస్ట్–ఇండియా ఫస్ట్’ అనే వైఖరినే అనుసరించాలని సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రజానుకూల విధానాలకే తప్ప, రాజకీయాలకు తావుండరాదన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు.
గురువారం 15వ సివిల్ సర్వీసెస్ డే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగీస్తూ రానున్న 25 ఏళ్లను ‘అమృత్ కాల్’గా అభివర్ణించారు. ‘ఈ 25 ఏళ్లను యూనిట్‌గా తీసుకుని, ఒక విజన్‌తో ముందుకు సాగాలి. దేశంలోని ప్రతి జిల్లా ఇదే ఆశయంతో ఉండాలి’అని ఆకాంక్షించారు. చివరికి స్థానిక స్థాయిలో తీసుకునే నిర్ణయాలు సైతం ఇదే గీటురాయి ఆధారంగా ఉండాలని ఆయన సూచించారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరిస్తూ మూడు లక్ష్యాలకు మనం కట్టుబడి ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ‘మొదటిది.. సామాన్య పౌరుడి జీవితాల్లో మార్పు తేవాలి. వారి జీవనం సులభతరం కావాలి. అదే సౌలభ్యాన్ని వారు అనుభవించాలి. రోజువారీ జీవితంలో ప్రభుత్వ సేవలను ఎటువంటి అడ్డంకులు లేకుండా వారు పొందగలగాలి. ఇదే మనందరి లక్ష్యం. దీనిని సాకారం చేయాలి’ అని స్పష్టం చేశారు.
రెండోది..పెరుగుతున్న మన దేశం స్థాయిని దృష్టిలో ఉంచుకోవాలి. అదే స్థాయిలో మనం కార్యక్రమాలు చేపట్టాలి మూడోది.. ఈ వ్యవస్థలో మనం ఎక్కడున్నా దేశ సమైక్యత, సమగ్రతలే మన ప్రధాన బాధ్యతగా ఉండాలి. ఇందులో ఎలాంటి రాజీ ఉండరాదు. స్థానిక నిర్ణయాలకు సైతం ఇదే ప్రామాణికం కావాలి అని మోదీ సూచించారు. తన స్వభావం రాజనీతి కాదని, జననీతి అని కూడా ప్రధాని స్పష్టం చేసారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?