కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే

కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే
ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ఇంజనీర్స్ కార్ప్స్‌ నుంచి ఆర్మీ చీఫ్‌గా నియమితులవుతున్న మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం. 
 
29వ ఆర్మీ చీఫ్‌గా ఆయన ఈనెలాఖరులో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే తన 28 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాండే కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు.
 
నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన పాండే 1982 డిసెంబర్‌లో ఇంజనీర్స్‌ కార్ప్స్‌లో చేరారు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పల్లన్‌వాలా సెక్టార్‌లో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో ఇంజనీర్ రెజిమెంట్‌కు కమాండంట్‌గా పాండే వ్యవహరించారు. 
 
39 ఏళ్ల మిలటరీ కెరీర్‌లో ఆయన ఎల్ఓసీ వెంబడి లడక్ సెక్టార్‌లో ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు, ఈశాన్య ప్రాంతంలోని కార్ప్స్‌కు కమాండంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈస్ట్రన్ కమాండ్‌ బాధ్యతలు తీసుకునే ముందు అండమాన్ నికోబార్ కమాండ్‌కు కమాండర్-ఇన్-చీఫ్‌గా పాండే పనిచేశారు.