జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఆర్మీ వీడియో

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఆర్మీ వీడియో
జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులు, గతంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో జమ్మూ కాశ్మీర్‌ ఎంతటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో, అక్కడి ప్రజలు ఎలాంటి దాడులను ఎదుర్కొన్నారో తేటతెల్లం చేస్తోంది. 
 
ఇక ఈ వీడియోలో.. ‘దశాబ్దాల తీవ్రవాదం మాకు అనాథలు, వితంతువులు, రోధిస్తున్న తల్లులు, నిస్సహాయ తండ్రులను మిగిల్చింది అనే వచనాలు కనిపిస్తాయి. అలాగే కాశ్మీరీ పండిట్ల వలసలు, రెస్క్యూ ఆపరేషన్లు, రాళ్లు రువ్వే సంఘటనల దృశ్యాలు కనిపిస్తాయి. 
 
అలాగే దశాబ్దాలుగా ఉగ్రవాదులు యువతను ఎలా తప్పుదారి పట్టించారో, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ఎలా ప్రేరేపించారో కూడా హైలెట్‌ చేస్తోంది. ఉగ్రవాదులు కాశ్మీర్‌ని యుద్ధభూమిగా ఎలా మార్చారో కూడా చూపిస్తుంది. 
 
ఉగ్రవాదుల చేతిలో హతమైన జర్నలిస్టు షుజాత్‌ బుఖారీ, సామాజిక కార్యకర్త అర్జుమంద్‌ మజీద్‌, మఖన్‌ లాల్‌ బింద్రూ, సర్పంచ్‌ అజరు పండిత, సుపీందర్‌ కౌర్‌, వసీం బారీ, లెఫ్టినెంట్‌ ఉమర్‌ ఫయూజ్‌, అయూబ్‌ పండిత, పర్వేజ్‌ అహ్మద్‌ దార్‌లకు ఈ వీడియో నివాళులర్పించింది. 
 
ఉగ్రవాదుల చేతిలో చితికిపోతున్న కాశ్మీర్‌ ఒంటరిగా లేదు. గతంలోనూ, భవిష్యత్తులోనూ పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో కాశ్మీరీ ప్రజలు విజయం సాధిస్తారన్నట్లుగా ఉద్వేగభరితమైన సందేశాన్ని ఈ వీడియో తెలియజేస్తోంది.

ఇక ఈ వీడియోపై భారత సైన్యం ‘కాశ్మీర్‌ పోరాడుతోంది’ అని ట్వీట్‌ చేసింది. అలాగే ఈ వీడియోలో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భద్రతా దళాలు చేపట్టిన ప్రయత్నాలు చూపించింది.