వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా పట్టని ప్రభుత్వం 

వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా పట్టని ప్రభుత్వం 

వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మొత్తుకుంటున్నా కేసీఆర్ ప్రభుత్వం  అస్స‌లు పట్టించుకోకపోవడం లేదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. శ్రీ‌రామ‌సాగ‌ర్ భారీ నీటిపారుద‌ల ప్రాజెక్ట్ జ‌లాలు చెరువులకు అంద‌డం లేదని, మరమ్మతుల పేరుతో అధికారులు జ‌లాలు విడుద‌ల చేయ‌డం లేదని ఆమె తెలిపారు. 

కాంట్రాక్టుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కయి రైతులను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. మరమ్మతుల పేరిట చెరువులకు ఎస్సారెస్పీ జ‌లాలు అందకుండా చేస్తున్నారని,  ప్రజాప్రతినిధులు, అధికారులు కాసుల కోసం కక్కుర్తి ప‌డి రైతులను దగా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో పంట‌ల‌ు ఎండిపోతున్నప్పటికీ ప్ర‌భుత్వం యంత్రాంగం చోద్యం చూస్తోందని ఆమె చెప్పారు.  కేసీఆర్… బంగారు తెలంగాణ అంటే ఇదేనా? దీనికేం స‌మాధానం చెబుతావు? అంటూ ఆమె ప్రశ్నించారు. 

యాసంగిలో ఎస్సారెస్పీ జలాలు విడుదల చేస్తమని, పంటలు వేసుకోండని చెప్పిన అధికారులే నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా అనేక సాకులు చెబుతూ దాటవేస్తున్నరని విజయశాంతి ధ్వజమెత్తారు.  పంటలను కాపాడేందుకు తాము బాగా కష్టపడుతున్నమంటూ పైపైకి నటిస్తూ, తాము చేయదల్చుకున్నది హాయిగా చేసుకుపోతున్నరని ఆమె ఎద్దేవా చేశారు. 

ఓ పక్క భూగర్భజలాలు అడుగంటి బోర్లు సరిగా పోయట్లేదు. మరోపక్క ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందట్లేదని ఆమె తెలిపారు.  వెరసి ఆయకట్టు పరిధిలోని భూముల్లో వరిపైరు ఎండిపోతున్నదని,  రైతులు ఆ పొలాల్లో పశువులను మేపుకుంటున్నరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

 యాసంగిలో ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వం అని…. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయిందని ఆమె దుయ్యబట్టారు. ఇప్ప‌టికైనా ఎస్సారెస్పీ జ‌లాల‌ను పొలాల‌కు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. క‌మిష‌న్ల కోసం క‌క్కుర్తి ప‌డే ఈ ప్ర‌భుత్వానికి రైత‌న్న‌లే త‌గిన బుద్ధి చెబుతారని విజ‌య‌శాంతి హెచ్చరించారు.