
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసిఎస్‌ఇ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఒఎస్) సహా పలు రాష్ట్రాల బోర్డులు నిర్వహించే 10, 12 తరగతుల ఆఫ్‌లైన్ పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఈ తరహా పిటిషన్లు దాఖలుచేసి విద్యార్థుల్లో గందరగోళం సృష్టించొద్దని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో ఆఫ్‌లైన్ పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థుల తరపున చిన్నారుల హక్కుల కార్యకర్త అనుభ శ్రీవాస్తవ సహారు, స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఒరిస్సా తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కెఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
”పరీక్షలు రద్దు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయడం ఓ సంప్రదాయంగా మారరాదు. ఇలాంటి పిటిషన్లు ఎలా దాఖలు చేస్తుంటారు?. ఇలాంటి పిటిషన్లతో మరోసారి వస్తే జరిమానా కూడా విధించాల్సి ఉంటుంది. వీటి వల్ల విద్యార్థులకు తప్పుడు ఆశలు కల్పించినట్లు అవుతుంది. ఎలాంటి ఆదేశాలు జారీ చేసేది లేదు. రాష్ట్రాల నిర్ణయాలను నిర్ణయించడానికి మీరెవరు? మేమెవరు?. అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ అధికారుల నిర్ణయం సరిగా లేకుంటే సవాల్ చేసుకోవచ్చు” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఈ పిటిషన్‌ను తక్షణం లిస్టింగ్ చేయాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ సారథ్యంలోని బెంచ్ ముందు సోమవారం ఈ పిటిషన్ వేశారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఫిజికల్ ఎగ్జామ్స్ నిర్వహించరాదని సిజెఐ సారథ్యంలోని బెంచ్‌ను కౌన్సిల్ కోరారు.
దీంతో జస్టిస్ ఖన్విల్కర్ సారథ్యంలోని బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చింది. ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్‌ఇ నిర్ణయించింది. సిఐఎస్‌ఇ కూడా బోర్డు పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనుండగా, కొన్ని రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా