
కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర కన్నెర్ర చేశారు.
నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు హైకోర్టు తాత్కాలిక ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు నిరసనలు సాగిస్తుండటంపై జ్ఞానేంద్ర మాట్లాడుతూ, ఇంతకాలం తాము ఓపికతో వ్యవహరించామని చెప్పారు.
ఇంకెంతమాత్రం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి మనోభావాలు దెబ్బతినకూడదని తాము ఇంతవరకూ ఓర్పుతో ఉన్నామని పేర్కొన్నారు. బయట వ్యక్తులు రెచ్చగొడుతుండటంతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ కోర్టు ఉత్తర్వులకు కట్టుబడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన కోరారు. వీటిని ఉల్లంఘిస్తే మరో ఆలోచనా లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిజాబ్ తమ హక్కంటూ ముస్లిం విద్యార్థినులు రోడ్లపైకి వస్తుండటంపై మాట్లాడుతూ, ఇంతవరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోలేదని మంత్రి చెప్పారు. మొత్తం మీద శాంతియుత వాతావరణమే ఉందని తెలిపారు.
కాగా, హిజాబ్‌పై ఆంక్షలు ఎత్తివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు విద్యార్థులు ఇప్పటికీ తరగతులకు హాజరుకావడం లేదు. ఈ అంశంపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మూసివేసిన విద్యా సంస్థలను ఈ నెల 9 నుంచి తిరిగి ప్రారంభించారు. అయితే ఉడిపిలోని ప్రభుత్వ ప్రి యూనివర్శిటీ కాలేజీలో చదువుతున్న ఆ ఆరుగురు విద్యార్థినులు బుధవారం కూడా తరగతులకు హాజరుకాలేదు.
మరోవంక, కర్ణాటక హైకోర్టులో వరుసగా నాలుగో రోజు కూడా హిజాబ్ వివాదంపై విచారణ జరిగింది. సమాజంలో అన్ని వర్గాల్లోనూ విభిన్నమైన మతపరమైన చిహ్నాలు ఉన్నాయని.. అటువంటప్పుడు ప్రభుత్వం హిజాబ్‌ని మాత్రమే ఎంచుకుని విద్వేషపూరితంగా వివక్ష చూపుతోందని పిటిషనర్‌ల తరుపు న్యాయవాది రవివర్మ కుమార్ వాదించారు. ప్రతిరోజూ మేలిముసుగు, గాజులు, కంకణాలు, తలపాగాలు, శిలువలు, బిందీలు ధరిస్తున్నారని తెలిపారు. హిజాబ్‌ని మాత్రమే ఎందుకు వేరు చేసి వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్