సౌర, పవన విద్యుత్‌లో కోతలపై హైకోర్టు విస్మయం

సౌర, పవన విద్యుత్‌లో కోతలపై హైకోర్టు విస్మయం
సౌర, పవన విద్యుదుత్పాదన డిమాండ్‌కు మించి ఉన్నప్పుడు వాటిల్లో కోత విధించి కాలుష్యాన్ని పెంచే థర్మల్‌ విద్యుత్‌ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సౌర, పవన విద్యుదుత్పాదక సంస్థలకు సంబంధించిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ధరలపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
సౌర, పవన విద్యుత్‌ ధరల సమీక్షపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు ఉన్న అధికారాలు, స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) తీరు తదితర అంశాలపై ప్రైవేట్‌ ఉత్పాదక సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ముగిసింది. సౌర విద్యుత్‌ యూనిట్‌కు రూ. 2.44, పవన విద్యుత్‌ రూ. 2.43 ధరల కు సంబంధించి ఉత్పాదక సంస్థలు పిటిషన్లు వేశాయి.
దీనిపై డిస్కంలు, ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఆ తరువాత ఉత్పాద సంస్థలు కూడా స్పందించాయి. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తుది నిర్ణయాన్ని తరువాత వెలువరిస్తామని స్పష్టం చేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం వాదనలు వింది. ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల తరుపున సీనియర్‌ న్యాయవాదులు సజన్‌ పువయ్య, బసవప్రభు పాటిల్‌, సంజయ్‌సేన్‌, పి శ్రీరఘురాం వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ డిమాండ్‌కు మించి ఉత్పత్తి ఎక్కువగా ఉంటే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌లో ఎందుకు కోత విధించలేదని ప్రశ్నించింది. ఇది కాలుష్యాన్ని పెంచే థర్మల్‌ విద్యుత్‌ను ప్రోత్సహించినట్టే అవుతుందని వ్యాఖ్యానించింది.