
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిజెపియే అధికారం లోకి వస్తే ముఖ్యమంత్రిగా తిరిగి యోగి ఆదిత్యనాధ్ అయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ఆదివారం వర్చువల్ పోల్ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు.
మధుర, ఆగ్రా, బులంద్‌షహర్, ఓటర్లను ఉద్ధేశించి ఆయన ఈ ర్యాలీలో ప్రసంగిస్తూ గత రెండేళ్లలో కరోనా సంక్షోభం లేకుంటే యోగీ ఆదిత్యనాధ్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించి అనుకున్న లక్షాలను నెరవేర్చి ఉండేవారని చెప్పారు. ఇలాంటి లక్షాలను ఆదిత్యనాధ్ నెరవేర్చడానికి వీలుగా వచ్చే ఐదేళ్లు బిజెపి పరిపాలించేలా ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉజ్వల స్కీమ్ కింద పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడమౌతుందని ప్రస్తావిస్తూ వచ్చే ముఖ్యమంత్రి ఆదిత్యనాదే అన్న అభిప్రాయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆదిత్యనాధ్ ప్రభుత్వం రాకముందు సమాజ్‌వాది ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించడాన్ని ప్రస్తావించారు.
ఉత్తరప్రదేశ్‌లో బిజెపిని గెలిపించాలని, ఆదిత్యనాధ్‌ను ముఖ్యమంత్రి చేయాలని (భాజాపా కో జితానా జై, యోగీకో ఫిర్ ముఖ్యమంత్రి బనానా హై) ఉత్తరప్రదేశ్ మహిళలు నిర్ణయించుకున్నారని మోదీ జోస్యం చెప్పారు.
డబ్బు, కండబలం, కులతత్వం, మతతత్వం ప్రాతిపదికన కొందరు వ్యక్తులు ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజల ప్రేమను పొందలేరని యూపీ ప్రజలు సూటిగా చెప్పారని ప్రధాని పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన కలలో శ్రీకృష్ణుడిని చూస్తానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడిన ప్రధాని, “బీజేపీకి ఉన్న అపారమైన మద్దతును చూసి, ఈ ప్రజలు ఇప్పుడు తమ కలలలో శ్రీకృష్ణుడిని చూస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వాలు అవినీతిని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తూ.. ‘గత ప్రభుత్వాలకు లాకర్లను నింపుకోవడం మరో ఫేవరెట్ గేమ్.. అందరూ కలిసి ఆడుకునేవారు.. కలిసి తినేవారు.. నేడు అలాంటి వాళ్ల ఆట మొత్తం చెడిపోయింది’ని చెప్పారు. స్పష్టంగా ఎస్పీని ఉద్దేశించి, “ఇంతకుముందు, కుటుంబం ప్రభుత్వం. ఇప్పుడు యూపీ మొత్తం బీజేపీ ప్రభుత్వ కుటుంబం” అని స్పష్టం చేశారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం