ఇంగ్లీష్ మీడియం అంటూ కేసీఆర్ కొత్త డ్రామా

కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని గప్పాలు కొట్టిన సీఎం కేసీఆర్ మారుమూల గ్రామాల విద్యార్థులకు సర్కారీ విద్యను దూరం చేసి పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని పెంచారని బీజేపీ జాతీయ  సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతామంటూ కేసీఆర్ కొత్త డ్రామా మొదలెట్టారని ఎద్దేవా చేశారు. 
 
అసలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, పిల్లల కోసం టాయిలెట్లు కూడా నిర్మించని దుస్థితి నెలకొందని ఆమె ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పిన కేసిఆర్ ఏనాడూ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవని ఆమె పేర్కొన్నారు. 
 
ఏడేండ్లుగా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటివరకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండా… విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యను ఎలా అందిస్తారో కేసీఆర్ చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు.