అన్నమయ్య మార్గం రహదారిపై పునరాలోచించాలి

తిరుమలకు కడప నుండి గల కాలిబాటలో నూతనంగా బస్సుల రాకపోకల కోసం రహదారి నిర్మించాలనే ఆలోచనను టిటిడి పునరాలోచించుకోవాలని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి  విజ్ఞప్తి చేసింది. తిరుపతి- తిరుమల మధ్య గల రెండో ఘాట్ రోడ్ లో బండరాళ్లు తరచుగా పడుతూ ఉండడం కారణంగా ఇటువంటి ఆలోచన తగదని తిరుపతిలో గల సమావేశం హితవు చెప్పింది. 
 
ఆ మార్గంలో స్వేచ్ఛగా తిరుగుతున్న అనేక అటవీ జంతువుల ఉనికికి రోడ్ మార్గం ప్రమాదం కాగలదని హెచ్చరించింది. రోడ్ మార్గం కోసం అనేక చెట్లను కూల్చివేయవలసి వస్తుందని, ఆ మార్గంలో గల పలు దేవాలయాలు సహితం కలుషితం కాగలవని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఇప్పటికే ప్రభుత్వం అనేక నిబంధనలు అమలు పరచే ప్రయత్నం చేస్తున్నా తిరుమల అటవీ ప్రాంతం నుండి ఎర్రచందనం పెద్ద ఎత్తున దొంగ రవాణా నిరాటంకంగా జరుగుతూనే ఉన్నదని పేర్కొంటూ ఇక్కడ రహదారి నిర్మిస్తే భవిష్యత్ లో దుకాణాలు, భవనాల నిర్మాణంకు అనుమతి ఇవ్వవలసి వస్తుందని, అప్పుడు మొత్తం అటవీప్రాంతం కనుమరుగయ్యే ప్రమాదం ఉండగలదని స్పష్టం చేసింది. 
 
పకృతిపరమైన రాగాల ఇటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అన్నయ్య మార్గంలో కేవలం కాలిబాటకే పరిమితం చేయాలని సమితి సమావేశం టిటిడి ట్రస్ట్ బోర్డు ను కోరింది. ఇప్పటికే విజిలెన్సు విభాగం కన్నుగప్పి అనేక నిషేధ వస్తువులు తిరుమలకు చేరుతున్నాయని చెబుతూ అన్నయ్య మార్గంలో ఆ విధంగా రాకుండా చూడాలని సూచించింది. చాలాకాలంగా చంద్రగిరి వైపు నుండి గల కాలినడక మార్గంలో రహదారి నిమరించే అవకాశాలను పరిశీలించాలని సమావేశం సూచించింది. 
 
ఎస్సి/ఎస్టీ భక్తులకు వైకుంఠద్వార దర్శనం పట్ల హర్షం 
 
ఇలా ఉండగా, ఎస్సి/ఎస్టీ భక్తులకు వైకుంఠద్వార దర్శనం కలిగిస్తూ టిటిడి తీసుకున్న నిర్ణయాన్ని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి స్వాగతించింది. జనవరి 13 నుండి 22 వరకు పది రోజుల పాటు, రోజుకు వేయి మంది చొప్పున భక్తులకు అవకాశం కలిగించడం పట్ల హర్షం ప్రకటించింది. 
 
రాష్ట్రంలో టిటిడి ఆర్హ్దిక సహకారంతో నిర్మించిన 502 మత్స్యకార గ్రామాల ప్రజలకు మాత్రమే ఈ  దర్శన సదుపాయం కల్పించారు. తరతరాలుగా హిందూ సమాజ నిర్లక్ష్యానికి గురైన భక్తులు ఈ సదుపాయంతో పరవశించి పోయారని సమితి కొనియాడింది. వీరంతా మొదటిసారిగా శ్రీవారి దర్శనం చేసుకున్నారని చెబుతూ ఈ సదుపాయం కారణంగా రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతున్న అక్రమ  మతమార్పిడి కార్యక్రమాలకు గండి పడగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. 
 
ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు కోసం క్రియాశీలకంగా పాల్గొన్న సమితి నాయకులు, కార్యకర్తలను సమావేశం అభినందించింది. ఇటువంటి అనేక కార్యక్రమాలను టిటిడి మున్ముందుకూడా చేపట్టాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. 
 
జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ నాయకులు కె శ్యామ్ ప్రసాద్ ముఖ్యఅతిధిగా పాల్గొని మార్గదర్శనం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సుబ్బరామిరెడ్డి, ఆచార్య సుందరమూర్తి తదితరులు కూడా పాల్గొన్నారు.