భారత్ కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు

అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం భించారు.  మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
మన దేశానికి అంతర్జాతీయంగాగల కీర్తి, ప్రతిష్ఠలను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇవి కేవలం రాజకీయాలు మాత్రమేనని చెప్పుకుంటూ పక్కన పడేయకూడదని మోదీ హితవు చెప్పారు. ఇది మన దేశ పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశమని తెలిపారు. భారత దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బ్రహ్మ కుమారీస్, ఇతర అంతర్జాతీయ సంస్థలు పోషించదగిన పాత్రను వివరించారు.
వివిధ దేశాల ప్రజలకు మన దేశం గురించి సరైన సమాచారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారమవుతున్న వదంతులు, పుకార్లపై పోరాడవలసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పారు.
 
నేడు దేశంలో వివక్షకు తావులేని వ్యవస్థ ఉందని ప్రధాని చెప్పారు. సమానత్వం, సాంఘిక న్యాయం పునాదులపై బలంగా నిలిచే సమాజాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.  ఆలోచనలు, వైఖరి సృజనాత్మకంగానూ, నిర్ణయాలు  ప్రగతిశీలంగానూ ఉన్న భారత దేశ ఆవిర్భావాన్ని మనం చూస్తున్నామని చెప్పారు.
నేడు కోట్లాది మంది భారతీయులు సువర్ణ భారత దేశానికి పునాది రాయి వేస్తున్నారని చెప్పారు. దేశ ప్రగతిలోనే మన అభ్యుదయం ఉందని స్పష్టం చేశారు. మన వల్ల దేశం మనుగడ సాగిస్తుందని, దేశం వల్ల మనం మనుగడ సాగిస్తామని తెలిపారు.
ఈ అవగాహన కలగడం నవ భారత నిర్మాణంలో భారతీయులకు అతి పెద్ద బలంగా మారుతోందని ప్రధాని  వివరించారు. ఈ అమృత కాలం నిద్రపోతూ కలలు కనడానికి కాదని, జాగృతమవడం ద్వారా దృఢ సంకల్పాలను నెరవేర్చుకోవడానికేనని తెలిపారు. రానున్న పాతికేళ్ళు కఠోర శ్రమ, త్యాగం, అంకితభావం నిండిన శ్రద్ధ ఉచ్ఛ స్థితికి చేరుకునే కాలమని తెలిపారు.
వందలాది సంవత్సరాల బానిసత్వంలో కోల్పోయినదానిని తిరిగి పొందే పాతికేళ్ళ సమయమిదని పేర్కొన్నారు.  ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బ్రహ్మకుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
‘నా భారత దేశం-ఆరోగ్య భారత దేశం’, ‘ఆత్మనిర్భర్ భారత్-స్వయం సమృద్ధ రైతులు’, ‘వుమెన్ : ఫ్లాగ్ బేరర్స్ ఆఫ్ ఇండియా’, ‘పవరాఫ్ పీస్ బస్ కాంపెయిన్’, అన్‌దేఖా భారత్ సైకిల్ ర్యాలీ, యునైటెడ్ ఇండియా మోటార్ బైక్ కాంపెయిన్, స్వచ్ఛ భారత్ అభియాన్ క్రింద హరిత హారం కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. గ్రామీ పురస్కార విజేత రిక్కీ కేజ్ రూపొందించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పాటను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.