బీహెచ్ఈఎల్ ప్లాంటు జాతికి అంకితం

స్వదేశీ పరిజ్ఞానంతో బొగ్గు నుంచి మిథనాల్ ను ఉత్పత్తి చేసేందుకు బీహెచ్ఈఎల్ స్వదేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన ప్లాంటును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే శనివారం జాతికి అంకితం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ సీఎండీ డాక్టర్ నలిన్ సింఘాల్ , భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.
 హైదరాబాద్  బీహెచ్ఈఎల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ఆత్మ నిర్బర్ భారత్ కింద అభివృద్ధి చేసిన ఉత్పతుల’ ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా  ‘భారత స్వాతంత్య్ర పోరాటంలో తగిన గుర్తింపు పొందని తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర వీరులు’ అనే అంశంపై దృశ్య శ్రవణ ప్రదర్శన జరిగింది.
దేశం వివిధ ప్రాంతాలకు చెందిన  బీహెచ్ఈఎల్  ఉద్యోగులు కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో  ఆన్‌లైన్ లో  పెద్ద సంఖ్యలో లాగిన్ అయ్యారు.  బ్రాడ్‌కాస్ట్ పద్ధతిలో కార్యక్రమాన్ని వెబ్‌కాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఉత్పత్తి రంగం పాత్ర ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ద్వారా ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ సహాయ సహకారాలను అందిస్తున్నదని మంత్రి వివరించారు.
ఉత్పత్తి రంగ అభివృద్ధిలో క్యాపిటల్ గూడ్స్ పరిశ్రమ వెన్నెముకగా ఉంటుందని మహేంద్ర నాథ్ పాండే పేర్కొన్నారు. తయారీ రంగానికి అవసరమైన యంత్రాలు, పరికరాలను క్యాపిటల్ గూడ్స్ పరిశ్రమ అందిస్తుందని మంత్రి అన్నారు. దేశంలో అతి పెద్ద ఇంజనీరింగ్, ఉత్పత్తి సంస్థ అయిన బీహెచ్ఈఎల్ దేశాభివృద్ధిలో అంశంలో కీలక పాత్ర పోషించవలసి ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఆత్మ నిర్బర్ భారత్ ను నిర్మిస్తామని ఇటీవల జరిగిన కాప్ 26 సమావేశంలో ప్రధానమంత్రి చేసిన ప్రకటనను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ఏకెఏఎం ఐకానిక్ వీక్’ వేడుకల సందర్భంగా బీహెచ్ఈఎల్  చేపట్టిన సంస్థ సీఎండీ డాక్టర్ నలిన్ షింఘల్వి వివరించారు. బీహెచ్ఈఎల్ అభివృద్ధికి  సహకారం అందిస్తున్న  భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రభుత్వానికి కృతజ్జతలు  తెలిపారు.
పరిశోధన, అభివృద్ధి అంశాలకు బీహెచ్ఈఎల్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి చెప్పారు.  బీహెచ్ఈఎల్  అభివృద్ధిలో ఈ రెండు అంశాలు కీలకంగా ఉన్నాయని తెలిపారు.   ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు (కాప్ 26) లో ప్రధానమంత్రి ప్రకటించిన  ‘పంచామృత’ లక్ష్య సాధనలో  బీహెచ్ఈఎల్ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.
0.25 టీపీడీ సామర్థ్యం  గల  సీటీఎం ప్లాంటును  పూర్తి  స్వదేశీ  పరిజ్ఞానం తో  బీహెచ్ఈఎల్  రూపొందించి, అభివృద్ధి చేసి నెలకొల్పింది. ప్రస్తుతం అధిక బూడిద కలిగి ఉండే  భారతీయ బొగ్గు నుంచి 99% కంటే ఎక్కువ స్వచ్ఛతతో మిథనాల్‌ను ఉత్పత్తి చేస్తోంది. గ్యాసిఫికేషన్ మార్గం ద్వారా అధిక బూడిద కలిగి ఉండే భారతీయ బొగ్గును మిథనాల్‌గా మార్చే పరిజ్ఞానం అందుబాటులోకి రావడం  భారతదేశంలో ఇదే తొలిసారని చెప్పారు.