కరోనా కట్టడికి రంగంలోకి అమెరికా సైన్యం

అమెరికాలో భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బైడెన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యాన్ని రంగంలోకి దించనుంది. వచ్చే వారం నుంచి 1000 మంది సైనిక వైద్య సిబ్బంది దేశ వ్యాప్తంగా మోహరిస్తామని తెలిపారు. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్‌ కిట్లతో పాటు వైరస్‌ బారినపడకుండా రక్షణ కల్పించేందుకు ఎన్‌95 మాస్క్‌లను ఉచితంగా అందిస్తామని బైడెన్‌ ప్రకటించారు.
వైద్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందుకే సైనికులను రంగంలోకి దించుతున్నామని వివరించారు. ఈ నిర్ణయంతో వైద్య వ్యవస్థపై కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. ఇంకా చాలా మంది టీకా తీసుకోలేదని, వారు ఒమిక్రాన్‌ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించారు.
దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులపై కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. వైద్య సిబ్బంది కరోనా బారినపడటంతో ఐసోలేషన్‌కు వెళ్లారని, దీంతో దేశ వ్యాప్తంగా సిబ్బంది కొరత వేధిస్తున్నదని చెప్పుకొచ్చాడు.
 
 ఇలా  ఉండగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్‌ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్‌ కంపెనీ మోనో క్లోనల్‌ యాంటీబాడీ థెరపీలను కోవిడ్‌ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు అంగీకరించారు.

లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్‌ ఔషధం కరోనా తీవ్రంగా సోకిన వారి ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్‌ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. 

ఇప్పటికే బారిక్టినిబ్‌ను అమెరికా, యూరప్‌లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్‌ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌ ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది.