కాంగ్రెస్ సంక్షోభానికి అగ్ర‌నాయ‌క‌త్వ వైఖ‌రే కారణం

కాంగ్రెస్ సంక్షోభానికి అగ్ర‌నాయ‌క‌త్వ వైఖ‌రే కారణం

అసోం, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌లో కాంగ్రెస్ సంక్షోభానికి పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వ వైఖ‌రే కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌నీష్ తివారీ విరుచుకుప‌డ్డారు. ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ చీఫ్ హ‌రీష్ రావ‌త్ ట్వీట్ పార్టీలో దుమారం రేపిన నేప‌ధ్యంలో మ‌నీష్ తివారీ కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని త‌ప్పుప‌ట్టారు. 

అసోం, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల ఎదుర్కొన్న సంక్షోభంతో ఉత్త‌రాఖండ్ ప‌రిణామాల‌ను మ‌నీష్ తివారీ పోల్చారు. అసోం సీఎం హిమంత్ బిశ్వ శ‌ర్మ 2014 జులైలో అప్ప‌టి సీఎం త‌రుణ్ గ‌గోయ్‌తో పాటు పార్టీ నాయ‌క‌త్వంతో విభేదించి బీజేపీలో చేరారు.  త‌న‌కు 52 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని శ‌ర్మ ప్ర‌క‌టించినా సీఎంను చేసేందుకు రాహుల్ గాంధీ నిరాక‌రించ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌ను వీడారని గుర్తు చేశారు.

ఇక పంజాబ్ సీఎంగా ప‌నిచేసిన కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల‌తో ఆ పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీజేపీతో జ‌ట్టు క‌ట్టారు.

పార్టీ సీనియ‌ర్ నేత‌ల న‌డుమ త‌లెత్తే విభేదాలు బ‌హిర్గ‌త‌మైనా వాటిని ప‌రిష్క‌రించ‌డంలో అగ్ర‌నాయ‌క‌త్వం విఫ‌ల‌మ‌వ‌డంతోనే ఆయా నేత‌లు కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని మ‌నీష్ తివారీ ట్వీట్ చేశారు. మ‌నీష్ తివారీ వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ఇరుకున పడవేస్తున్నాయి. 

హరీష్ రావత్ ట్వీట్ ల పట్ల కూడా అగ్రనాయకత్వం ఇంకా స్పందించలేదు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, తన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. 

అయితే ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ దేవేంద్ర యాదవ్ మాత్రం సమిష్టి నాయకత్వంలో ఎన్నికల పోరుకు వెడతామని స్పష్టం చేశారు. రావత్ – యాదవ్ ల మధ్య సఖ్యత కొరవడటమే ప్రస్తుత సంక్షోభానికి కారణం అని చెబుతున్నారు.