రిపబ్లిక్ డే కు ఐదు మధ్య ఆసియా దేశాలు 

వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు హాజరుకానున్నాయి. కజకిస్తాన్‌, కిర్గిజిస్తాన్‌, తజకిస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ దేశాలను భారత్‌ ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. 2018లో ఆసియాన్ దేశాలను ఇలాగే ఉమ్మడిగా అతిథులను ఆహ్వానించింది. 

అనంతరం రెండు కన్నా ఎక్కువసార్లు అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. మధ్య ఆసియా దేశాలతో భారత్‌కు సాంస్కృతిక, నాగరికత, చారిత్రాత్మక బంధాలున్నాయి. దీంతో పాటు బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా ఈ ఐదు దేశాలతో స్నేహం భారత్‌కు మరింత కీలకం కానున్నది.

సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఈ ఐదు దేశాలు ఇటు చైనా, పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో ఉండడం భారత్‌కు వ్యూహాత్మకంగా కలిసి వచ్చే అంశం కాగా.. రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించడం ద్వారా ఈ దేశాలతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఏర్పడనున్నది.

మరో వైపు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని  మధ్య ఆసియా దేశాలను సందర్శించారు. ఇంతకు ముందు సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయిన అనంతరం ఏర్పాటైన ఐదు దేశాలను ఏ భారత ప్రధాని సందర్శించలేదు.

ఇదిలా ఉండగా.. ఈ నెల 18, 19న నూఢిల్లీ వేదికగా శిఖరాగ్ర సదస్సు జరుగనున్నది. ఆయా దేశాల విదేశాంగ మంత్రులు సమావేశంలో పాల్గొననున్నారు. మధ్య ఆసియా, భారత్‌ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగడం ఇది మూడోసారి. తొలి సమావేశం ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో 2019, జనవరిలో జరిగింది. 

ఆ సదస్సులో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. గత సంవత్సరం సమావేశం వర్చువల్‌ విధానంలో జరిగింది. కనెక్టివిటీ, ఎనర్జీ, ఐటీ, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ మొదలైన రంగాల్లో ప్రాధాన్యతా అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్‌ గతంలో బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది.

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2014 నుంచి భారత్‌ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ (2016), యూఏఈ ఎండీ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (2017), 10 ఏషియన్‌ దేశాలు (2018), దక్షిణాఫ్రికా నుంచి రమాఫోసా (2019), బ్రెజిల్‌కు చెందిన జైర్ బోల్సోనారో (2020)ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. 

అయితే, గతేడాది (2021)లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ముఖ్య అతిథిగా పిలువగా.. కరోనా మహమ్మారి కారణంగా ఆయన రిపబ్లిక్‌ డే వేడులకు హాజరుకాలేకపోయారు.