వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ!

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ కలిసి పోటీచేసే అవకాశముందని, ఆ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కూడా జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. తాగు, ఊగు దండుకో అనే  విధంగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ..   లిక్కర్ సేల్స్  ద్వారా రూ 50 వేల కోట్ల ఆదాయం వచ్చేలా  ప్రణాలిక చేసుకున్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి,  మంత్రులు… భాష, యాస  చూసి  ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.  కేసీఆర్, కేటిఆర్ భాష మార్చుకోవాలని హితవు చెప్పారు. వర్షాకాలం పంట కొనబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడా చెప్పలేదని సంజయ్ స్పష్టం చేశారు. వానా కాలం పంట కొంటామని  నామా నాగేశ్వరరావు ముందే  పీయూష్ గోయల్ చెప్పారని పేర్కొన్నారు.
అయినా రాష్ట్రంలో వానాకాలం పంట కొనడం లేదని మండిపడుతూ రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ కు  కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజ్యసభ  ఎంపీలపైన  కేసీఆర్ కు  కోపం ఉన్నట్లుందని చెబుతూ అందుకే రాజ్యసభ ఎంపీలతో  రాజీనామా చేయించాలని  అనుకుంటున్నారని ఆరోపించారు. 
 
టీఆర్ఎస్ ఎంపీలు తెచ్చుకున్న ప్లకార్డ్స్ ని వాళ్లే చింపేసి.. నామా నాగేశ్వరరావు మీద పడేసి వెళ్లిపోయారని చెప్పారు. పీయూష్ గోయల్ సభలో సమాధానం చెప్పిన తర్వాత టిఆర్ఎస్ పరువు పోయిందని ధ్వజమెత్తారు. అందుకే  వాళ్ళు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాతకేసీఆర్  ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయాడని దుయ్యబట్టారు. 
 
బాయాల్డ్  రైస్   ఇవ్వబోమనే ఒప్పందం మీద కేసీఆర్ సంతకం చేశారని, కృష్ణా జలాల వాటాల ఒప్పందం మీద  కూడా ఇలాగే సంతకం చేశారని సంజయ్ స్పష్టం చేశారు.