జ‌న‌వ‌రి 31 వ‌ర‌కూ విదేశీ విమాన‌యానం ర‌ద్దు!

 క‌రోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌భావం నేప‌థ్యంలో వ‌చ్చేనెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, వివిధ దేశాల‌తో కుదుర్చుకున్న ఒప్పందాల మేర‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. 

ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 15న అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఒమిక్రాన్ ప్ర‌భావంతో ప‌లు దేశాలు అత‌లాకుత‌ల‌మ‌వుతున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ నిర్ణ‌యాన్ని కేంద్రం ప‌క్క‌న బెట్టింది.

అయితే, అంత‌ర్జాతీయ ర‌వాణా స‌ర్వీసుల‌కు వ‌ర్తించ‌ద‌ని డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) తెలిపింది. ఎంపిక చేసిన అంత‌ర్జాతీయ రూట్ల‌లో విమాన స‌ర్వీసుల‌ను అనుమ‌తించొచ్చున‌ని పేర్కొన్న‌ది. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వ‌చ్చే విదేశీ ప్ర‌యాణికుల కోసం ఢిల్లీ విమానాశ్ర‌య అధికారులు 20 కౌంట‌ర్లు ఏర్పాటు చేసింది.

ఈ కౌంట‌ర్ల వ‌ద్ద కొవిడ్‌-19 టెస్ట్‌ల కోసం ప్ర‌యాణికులు పేర్లు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. విమానాశ్ర‌య ట‌ర్మినల్స్‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ నెల‌కొన్న‌ద‌న్న‌ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో డీజీసీఏ న్యూ ట్రావెల్ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత్ గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేకులు వేసింది. ఆ తరువాత.. క్రమంగా ఆంక్షలను తొలగిస్తూ వచ్చిన ప్రభుత్వం 28 దేశాలతో ఎయిర్ బబుల్ విధానాన్ని ఏర్పాటు చేసింది. 

ఇందులో భాగంగా ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలను మాత్రం దేశంలోకి అనుమతిస్తోంది. ఎయిర్ బబుల్ విధానంలో ఓ దేశం మరో దేశానికి విమాన సర్వీసులను కొన్ని ఆంక్షలకు లోబడి కొనసాగించవచ్చు.