జీతాలు లేక వైదొలగుతున్న పాక్ ఎంబసీ ఉద్యోగులు

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ తన ఉదోగులకు కూడా జీతాలు ఇవ్వలేక పోతున్నది. చివరకు విదేశీ రాయబార కార్యాలయాలలో పనిచేసే వారికి నెలల తరబడి జీతాలు  లేకపోవడంతో ఉద్యోగులు ఒకొక్కరుగా వైదొలగుతున్నారు. ఆ విషయం ఆయా రాయబార కార్యాలయాల వెబ్ సైట్ లే స్పష్టం చేస్తున్నాయి. తమ ఆర్థిక ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేద‌ని సాక్షాత్తూ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మధ్యన ప్రకటించారు. 

అమెరికాలోని పాక్ రాయ‌బార కార్యాల‌య ఉద్యోగుల‌కు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. ఈ విష‌యాన్ని పాక్ వెబ్‌సైట్ ”ది న్యూస్” కూడా వెల్ల‌డించింది. ఈ దౌత్య కార్యాల‌యంలో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఆగ‌స్టు నెల జీతాలే ఇంకా రాలేద‌ని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఇక తాళ‌లేక‌.. ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నార‌ని పేర్కొంది.

అమెరికా లెక్క‌ల ప్ర‌కారం వీరికి నెల‌కు 2000 డాల‌ర్ల నుంచి 2500 డాల‌ర్లు చెల్లించాల్సి ఉంటుంది.  వీటిని పాకిస్తాన్ క‌మ్యూనిటీ వెల్‌ఫేర్ ఫండ్ నుంచి చెల్లిస్తారు. అయితే గ‌త సంవ‌త్స‌ర‌మే ఈ ఖాతా ఖాళీ అయిపోయింద‌ని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. 

కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో వెంటిలేట‌ర్లు, వ్యాక్సిన్ ఖ‌ర్చుల‌తో పాటు ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల నిమిత్తం పాక్ స‌ర్కార్ ఈ డ‌బ్బుల‌ను పూర్తిగా వాడేసింది. దీంతో బెంబేలెత్తిపోయిన పాక్ ఎంబ‌సీ అధికారులు ఈ విష‌యాన్ని పాక్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

జీతాలివ్వ‌క‌పోవ‌డంతో ఉద్యోగులు ఒక్కొక్క‌రుగా వైదొలుగుతున్నార‌ని, ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేద‌ని పాక్ ఎంబ‌సీ విదేశాంగ శాఖ‌కు మొర‌పెట్టుకుంది. దీంతో తేరుకున్న విదేశాంగ శాఖ అక్టోబ‌ర్ నెల జీతాలు చెల్లించ‌డానికి ముందుకొచ్చింది. దీనికోసం అప్పులు కూడా చేసింద‌ని ”ది న్యూస్” వెల్ల‌డించింది.