కేంద్రం స్పందనతో ఉద్యమం విరమణకు రైతులు సుముఖం!

తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ స్పందన పట్ల సంవత్సరకాలంగా నిరసన ఉద్యమం చేపట్టిన రైతు సంఘాలు సంతృప్తి చెందిన్నట్లు తెలుస్తున్నది. ఈ రోజు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు వారు ప్రకటన చేసే అవకాశం ఉంది. 
 
కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ఐదుగురు సభ్యుల కమిటీకి అందినట్టు చెబుతున్నారు. దాంతో, ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనను విరమించే ఆలోచనలో ఉన్నట్టు రైతు సంఘం నేత, ఎస్‌కెఎం సభ్యుడు ఒకరు తెలిపారు. బుధవారం అధికారికంగా ప్రకటన ఉంటుందని ఎస్‌కెఎం మరోనేత కుల్వంత్‌సింగ్ సంధూ తెలిపారు. 
 
మంగళవారం అంతా చర్చించిన రైతు సంఘాల నేతలు దాదాపుగా తమ డిమాండ్లన్నిటికీ హామీ ఇస్తూ ప్రభుత్వం నుంచి లేఖ అందిందని చెబుతున్నారు.  తాము ఏకాభిప్రాయానికి వచ్చామని, తుది నిర్ణయాన్ని బుధవారం ప్రకటిస్తామని సంధూ తెలిపారు. 
అధికార వర్గాల కధనం మేరకు, రైతు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కనిపించింది. మంగళవారం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)కు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ రాతపూర్వక ముసాయిదా ప్రతిపాదనను పంపింది. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై మంగళవారం సింఘూ సరిహద్దు వద్ద జరిగిన ఎస్‌కెఎం సమావేశంలో రైతు నేతలు చర్చించారు. 

ప్రభుత్వ ప్రతిపాదనలోని కొన్ని అంశాలపై మరిన్ని వివరణలు ఎస్‌కెఎం కోరుతుంది. తదుపరి చర్చ కోసం నేడు మధ్యాహ్నం 2 గంటలకు సింఘూ సరిహద్దు వద్ద ఎస్‌కెఎం తిరిగి సమావేశం కానుంది.

కేంద్రం ప్రతిపాదనలు 

1. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై ప్రధానమంత్రి, వ్యవసాయ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. రైతు ప్రతినిధిల్లో ఎస్‌కెఎం ప్రతినిధులు కూడా ఉంటారు.

2. ఆందోళన సమయంలో రైతుల కేసుల విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు ఆందోళన విరమించిన వెంటనే కేసులను ఉపసంహరించుకుంటామని పూర్తిగా అంగీకరించాయి. అలాగే రైతుల ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రైతులపై నమోదైన కేసులను కూడా ఉద్యమాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఉపసంహరించుకోవడానికి అంగీకరిస్తున్నాం.

3) పరిహారం విషయమై హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. కేసులు, పరిహారంపై పంజాబ్‌ ప్రభుత్వం బహిరంగ ప్రకటన కూడా చేసింది.

4) విద్యుత్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు అందరి అభిప్రాయాలు తీసుకుంటాం.

5) పంట వ్యర్థాలు తగలపెట్టే రైతులపై జరిమాన సమస్య విషయానికొస్తే, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం సెక్షన్‌ 14, 15లో నేర బాధ్యత నుండి రైతులకు మినహాయింపు ఇచ్చింది.

ఈ విధంగా ఐదు డిమాండ్లను పరిష్కరిస్తు న్నామని, ఇప్పుడు రైతు ఉద్యమాన్ని కొనసాగించడం సమర్థనీయం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇప్పటికే మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కి చట్టపరమైన హామీ, ఆందోళన సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, రైతు ఆందోళనకారులపై క్రిమినల్ కేసులు ఎత్తివేయడమనేవి ఎస్‌కెఎం ప్రధాన డిమాండ్లు. 

దేశంలోని 40కిపైగా రైతు సంఘాలకు ఐక్యవేదికగా ఉన్న ఎస్‌కెఎం తమ తరఫున కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఈ నెల 4న ప్రకటించింది. దాంతో, ఎస్‌కెఎం ఏర్పాటు చేసిన కమిటీకే కేంద్రం తరఫున లేఖ పంపినట్టు భావిస్తున్నారు.