భూమి కబ్జా చేశామని కలెక్టర్ చెప్పడంపై ఈటెల సతీమణి ఆగ్రహం 

మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్ ప‌రిధిలో అసైన్డ్ భూముల‌ను జ‌మునా హ్యాచ‌రీస్ 70.33 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసిన‌ట్లు రెవెన్యూ అధికారుల స‌ర్వేలో తేలింద‌ని మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రీశ్ చెప్పడం పట్ల బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ  కలెక్టర్‌పై ఖచ్చితంగా కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు. 

కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు.  ‘‘మా వ్యాపారాలకు అనుమతులు ఇవ్వదొద్దని పెద్దలు చెప్పిన్లటు అధికారులే చెప్తున్నారు. చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా?. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఒకలా.. బయటకొచ్చినాక మరొకలా వ్యవహరిస్తున్నారు. మా భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి?.’’ అని జమున ప్రశ్నించారు.

మహిళా సాధికారిత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి తనను మానసికంగా హింసించటం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో ఎదుర్కోవటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. 

తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారని జమున ఆరోపించారు. 33 జిల్లాల్లో ఈటల రాజేందర్ పర్యటిస్తారని, ఎదుర్కోవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని ఆమె సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను అమ్ముకున్నామని ఆమె చెప్పారు. తమ గెలుపును ఓర్వలేక ఈటల రాజేందర్‌ను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని జమున మండిపడ్డారు. 

కబ్జా చేశాననడం మతి లేని చర్య

తాను భూములు కబ్జా చేశాననడం మతి లేని చర్య అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. మంత్రి స్థాయిలో ఉన్న నేనే బెదిరించి అసైన్డ్ భూమి తీసుకుంటే .. మరి సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్ లో ఎన్ని వేల ఎకరాలు తీసుకొని ఉంటాడని ఆయన ప్రశ్నించారు. అధికారులు పిచ్చోల్లా అంటూ చట్టం ప్రకారం నడుచుకోవాలని హితవు చెప్పారు. 

సంగారెడ్డి జిల్లా కందిలో బీజేపీ  రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నాడని ఈటెల విమర్శించారు. చిన్న లొసుగును ఆధారం చేసుకుని 2014 లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీని కేసీఆర్ మింగేసాడని ఆరోపించారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా  చేశారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోందని విమర్శించారు.  హుజురాబాద్ ఎన్నికల్లో ప్రపంచ చరిత్రలో మనిషి హోదాను బట్టి రేట్ నిర్ణయించి డబ్బు పంచారని చెప్పారు.