గెహ్లాట్ ప్రభుత్వాన్నికూల్చం… వచ్చెది మా ప్రభుత్వమే!

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదని, ఎన్నికలతో ప్రజల ముందుకు వెళ్లి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా వ్యక్తం చేశారు. జైపూర్‌లో ఆదివారంనాడు జరిగిన జన్‌ప్రతినిధి సంకల్ప సమ్మేళన్‌లో పాల్గొంటూ 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

“వారెప్పుడు తమ ప్రభుత్వాన్ని బిజెపి కూల్చివేస్తుందని భయపడుతూ ఉంటారు? మీ ప్రభుత్వాన్ని పడగొట్టవలసిన అవసరం వేరేవారికి ఎందుకు? బిజెపి ఎప్పుడు మీ ప్రభుత్వాన్ని పడగొట్టదు” అంటూ అశోక్  గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

“మీరు అంతర్గత విభేదాలతో బిజీగా ఉన్నారు. రాజస్థాన్‌లో శాంతిభద్రతల నిర్వచనాన్ని మార్చారు…మీ ప్రభుత్వం బాగా నడుస్తోందని మీరు అనుకొంటే యుపి ఎన్నికలతో పాటు మీరూ ఇక్కడ ఎన్నికలు నిర్వహించండి. రాజస్థాన్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మీకు వెంటనే తెలుస్తుంది. అయితే మీరు 2023 వరకు మీ పదవీకాలాన్ని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము” అని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ ప్రజల కోసం కూడా పని చేయాలని తాము కోరుకొంటున్నట్లు హితవు చెప్పారు.

రాజస్థాన్ మాజీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా గెహ్లాట్‌పై దాడి చేస్తూ ఆయన ప్రభుత్వం “అదృశ్యం” అని ఆమె అభివర్ణించారు. గెహ్లాట్ ప్రభుత్వం ఒకే ఒక్క విషయంలో బిజీగా ఉందని ఆమె అన్నారు: “(సీఎం) కుర్చీని ఎలా కాపాడుకోవాలి; ఈ నలుగురు అక్కడికి వెళితే ఏమవుతుందో, ఐదుగురు అక్కడికి వెళితే ఏమవుతుందోనన్న భయాందోళన నెలకొంది. ఎవరైనా అటువైపు వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలనే ఆలోచనతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ పని మాత్రమే జరుగుతోంది”

పనికిరాని, అవినీతిలో కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి తరిమికొట్టాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు షా ఈ సందర్భంగా ఉద్బోధించారు. ప్రధాని మోదీ పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించారని, అయితే రాజస్థాన్‌ ముఖ్యమంత్రికి ఖజానా ఎంతో ఇష్టమైన రాష్ట్రమని,  ప్రజల సమస్యలు కాదని ఆయన విమర్శించారు. అందుల్లనే వాట్ ను తగ్గించమని గెహ్లాట్‌ని “అభ్యర్థించాడు” అని ఎద్దేవా చేశారు.

గెహ్లాట్ ప్రభుత్వం “వసుంధర జీ హయాంలో ప్రారంభించిన పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను” మూసివేసి, మార్చిందని అమిత్ షా విమర్శించారు. “భారత ప్రభుత్వం రాష్ట్రంలో చేయాలనుకుంటున్న అనేక పనులను” అడ్డుకున్నదని షా ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కో వ్యక్తికి రూ.65,300 అప్పు ఉందని, రాష్ట్రంలో ఒక బిడ్డ పుడితే రూ.65,300 అప్పు ఉందని షా పేర్కొన్నారు.

దేశంలోని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, గరీబీ హఠావో అనేది కేవలం నినాదాలకే ఆ పార్టీ పరిమితం చేసిందని అమిత్‌షా విమర్శించారు. పేదరికాన్ని తొలగించే బదులు పేదలనే తొలగిస్తున్నదని ధ్వజమెత్తారు.  ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదమిస్తే, అందుకు నిజమైన ప్రయత్నం చేసింది మాత్రం బీజీపీయేనని స్పష్టం చేశారు.  పేదల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. 

మోదీ ప్రభుత్వం టాయిలెట్ల నిర్మాణం, 11 కోట్ల మందికి పైగా సిలెండర్లు అందజేయడం చేసిందని, 60 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల వరకూ వైద్య సౌకర్యం కల్పించామని అమిత్ షా వివరించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ గత ఏడాది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం బీజేపీపై ఆరోపణలు చేయడాన్ని అమిత్‌షా తప్పుపట్టారు.

బీజేపీ ప్రజల వద్దకే వెళ్లి  2023లో భారీ ప్రజా తీర్పుతో అధికారంలోకి వస్తుందని అమిత్‌షా తెలిపారు. అశోక్ గెహ్లాట్ నిరర్ధక, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడటం, బీజేపీ పగ్గాలు పట్టుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

ఉదయం జైపూర్ విమానాశ్రయంకు అమిత్ షా చేరుకున్నప్పుడు బిజెపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బిజెపి సమావేశం జరుగుతున్న జైపూర్ ఎక్జిబిషన్ గ్రౌండ్స్ వరకు 9 కిమీ దూరం భారీ రోడ్ షో నిర్వహించారు. దారి పొడుగునా ఆయనకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు,  బిజెపి గుర్తులతో పెద్ద ఎత్తున అలంకరణ చేశారు. డ్రమ్ములు వాయిస్తూ స్వాగతం పలికారు.

మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా. సతీష్ పూనియాలతో సహా రాష్ట్రంలోని సీనియర్ పార్టీ నేతలు అందరు ఆయనకు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. అంతకు ముందు రాష్ట్ర బీజేపీ కార్యవర్గంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

“ఎన్‌సిఆర్‌బి ప్రకారం రాష్ట్రంలో మహిళలపై నేరాల కేసులు పెరుగుతున్నప్పటికీ, రాజస్థాన్‌లోని పోలీసులు, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నేతృత్వంలో, రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వివాహానికి ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నారు”, అని బీజేపీ సీనియర్ నేత రాజేంద్ర రాథోడ్ ఎద్దేవా చేశారు.