భార‌త్, ర‌ష్యా మ‌ధ్య ప‌లు ర‌క్ష‌ణరంగ‌ ఒప్పందాలు

భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ఇవాళ ప‌లు కీలక ర‌క్ష‌ణ ఒప్పందాలు జ‌రిగాయి. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షొయిగులు ఆ ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. 7.63x39mm క్యాలిబ‌ర్ క‌లిగిన ఏకే-203 అజాల్ట్ రైఫిళ్ల త‌యారీ అంశంలోనూ ఇద్ద‌రు ర‌క్ష‌ణ మంత్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

 ఆ ఒప్పందం ప్ర‌కారం సుమారు ఆరు ల‌క్ష‌ల ఏకే-203 రైఫిళ్ల‌ను త‌యారీ చేయ‌నున్నారు. 2021 నుంచి 2031 మ‌ధ్య కాలంలో ఆ ఆయుధాల‌ను స‌మీక‌రించ‌నున్నారు. క‌ల‌ష్నికోవ్ ఆయుధాల త‌యారీ గురించి 2019, ఫిబ్ర‌వ‌రిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం ఏకే-203 రైఫిళ్ల‌ను త‌యారీ చేయ‌నున్నారు.

 రాజ్‌నాథ్ సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షోయిగు, ర‌ష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ల‌వ్‌రోవ్ మ‌ధ్య ద్వైపాక్షిక స‌మావేశం జ‌రిగింది. ఇటీవ‌ల కాలంలో ఇండియా, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ రంగ స‌హ‌కారం అసాధార‌ణ రీతిలో ప్ర‌గ‌తి సాధించిన‌ట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

స‌వాళ్ల‌తో కూడిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ర‌ష్యా అతిపెద్ద భాగ‌స్వామిగా ఉంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రెండు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ స‌హ‌కారం చాలా కీల‌క‌మైంద‌ని, రెండు దేశాలు ప్రాంతీయ భ‌ద్ర‌తను మెరుగుప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తాయ‌ని ఆశిస్తున్న‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు. భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ఉన్న బంధం దృఢంగా, స్థిరంగా ఉన్న‌ట్లు విదేశాంగ మంత్రి జైశంక‌ర్ తెలిపారు.

భారత్‌, రష్యాల మధ్య నేడు జరగనున్న మొదటి  2+2  మంత్రివర్గ సదస్సుకు ముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌, రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షొయిగుతో సమావేశమయ్యారు. భారత్‌ -రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంలో రక్షణ శాఖల సమన్వయం అత్యంత ముఖ్యమైందని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) పేర్కొంది. 

రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలోని సైనిక సాంకేతిక సహకార కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. సైనిక – సాంకేతిక భాగస్వామ్యంతో పాటు కొనసాగుతున్న పలు ప్రాజెక్టుల స్థితిగతులు, చర్చలపై ఇరు దేశాల రక్షణ మంత్రులు సమీక్ష నిర్వహించారు. 

భారత్‌, రష్యా మొదటి 2+2 మంత్రివర్గ సదస్సులో తాలిబన్‌ స్వాధీనం అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితులు, ఉగ్రవాదుల నుండి వెలువడుతున్న బెదిరింపులు, మైనారిటీలు, మహిళల, చిన్నారుల మానవహక్కుల పరిరక్షణతో పాటు కీలకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. 

 రెండు దేశాలు 2021-31 కోసం తమ సైనిక-సాంకేతిక సహకార ఏర్పాటును పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు ఇరు దేశాలు తెలిపాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ప్రధాని నరేంద్ర మోదీతో  21వ వార్షిక భారత్‌-రష్యా శిఖరాగ్ర సమావేశంకు ముందు ఈ సమావేశం జరగడం గమనార్హం.