ఉద్యోగులు ప్రభుత్వాలను నిలబెట్ట వచ్చు, కూల్చవచ్చు

ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలను నిలబెట్ట వచ్చు, కూల్చవచ్చని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ శక్తి ముందు ఎవరైనా కూడా తలవంచాల్సిందే అని స్పష్టం చేశారు.  ఉద్యోగులకు పీఆర్సీ, తదితర విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి ఉద్యోగులంతా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

 పది రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద కాదని, ఉద్యమం ద్వారానే హక్కులు తెచ్చుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం సమ్మె నిర్వహణపై విజయవాడలో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఘాటైన వాఖ్యలు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘ నేను విన్నాను. నేను ఉన్నాను అనే జగన్‌ మాటలకు నమ్మి ఉద్యోగులంతా కలిసి వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టి తప్పుచేశామని ఆయన విచారం వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో అప్పటి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరు మూకుమ్మడిగా జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగి కుటుంబంలో 5 ఓట్లు ఉన్నా.. సుమారు 60 లక్షల ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. ప్రభుత్వాన్ని నిలబెట్టనూ వచ్చని అంటూ ఆయన ఒక విధంగా జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరిక పంపారు.  ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందేని స్పష్టం చేశారు.

ఏపీలో ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆదారపడిలేమని, ఉద్యమం ద్వారానే హక్కులను సాధించుకుంటామని భరోసా వ్యక్తం చేశారు.  ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు ఇవ్వక ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జీతం ఒకటో తేదీన ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా? గతంలో జీతం రావడం లేదని కలెక్టర్‌కు సాల్వింగ్‌ అని టె లిగ్రామ్‌ ఇస్తే.. ఎవరు జీతం ఇవ్వటం లేదో ఆ డ్రాయింగ్‌ ఆఫీసర్‌ను గందరగోళం చేసేవారు. ఇవాళ చచ్చిపోతున్నా కూడా జీతం అన్నా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని అంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. 

 “జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడినయ్యాను. జూలై 29న తిరుపతిలో ఒక సమావేశంలో చెప్పా. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే పాలవాళ్ల దగ్గర, కూరగాయల వాళ్ల దగ్గర లోకువ అయిపోయిందని చెప్పా. ప్రభుత్వ ఉద్యోగమంటే ఒక గర్వంగా ఉండేది. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి క్షీణమైపోయింది. ఈరోజు పాలవాళ్ల దగ్గర సుబ్బారావుకు జీతం వచ్చింది. ఎల్లయ్యకు రాలేదు అన్న పరిస్థితి అయిపోయింది’’ అని బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. 

“ఈ రోజున మనం చేస్తున్న ఉద్యమం మన కోసం… మన పిల్లల కోసం! భావితరాలకు ఉద్యమం ఎలా ఉండాలో చెప్పే దాని కోసమే తప్ప.. నీ (జగన్) మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కాదు! ఉద్యమం ద్వారా హక్కులు తెచ్చుకుంటామే తప్ప నీ (జగన్) దయాదాక్షిణ్యాలపై కాదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించే రోజు వచ్చిందని మనవి చేస్తున్నా” అంటూ ఆయన ఉద్యోగులకు పిలుపిచ్చారు.