మహారాష్ట్రలో మరో ఒమిక్రాన్‌ కేసు.. ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

తాజాగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలడంతో దేశంలో ఈ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. మొదట కర్ణాటకలో రెండు, గుజరాత్ లో ఒక కేసు నమోదు అయ్యాయి.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై దేశంలో భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ‘రిస్క్’ దేశాలతో పాటు విదేశాల నుంచి వచ్చేవారిపై నిఘా పెంచాలని కేంద్రం సూచించింది. 

హాట్‌స్పాట్‌లను పర్యవేక్షించాలని, కోవిడ్ రోగుల నమూనాలను జన్యు శ్రేణి కోసం పంపాలని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పెంచాలని కేంద్రం కోరింది. ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ కరోనా కేసులు, మరణాల రేటు వేగంగా పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

ముంబై శివారు కల్యాణ్‌ డోంబివాలి మున్సిపల్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడని మహా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ తెలిపారు. సదరు వ్యక్తికి 33 సంవత్సరాల వయసు ఉంటుందని, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ నుంచి దుబాయి, ఢిల్లీ మీదుగా ముంబైకి వచ్చాడని పేర్కొన్నారు. వైరస్‌ బారినపడ్డ వ్యక్తి కరోనా టీకా తీసుకోలేదని తెలుస్తోంది

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 మధ్య గత వారం కంటే కరోనా కేసుల నమోదు 727 శాతం పెరిగింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కూడా కరోనా కేసులు 152 శాతం పెరిగాయి. తమిళనాడులోని మూడు జిల్లాల్లో కొత్త కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. 

మిజోరాంలోని సైహా (237 శాతం) సహా నాలుగు జిల్లాలు, ఒడిశాలోని , దెంకనల్ (667 శాతం) ఆరు జిల్లాల్లో కరోనా లోడ్‌ భారీగా పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు కేరళలో కరోనా మరణాలు పెరుగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. 

నవంబర్ 19- 25 మధ్య త్రిస్సూర్ జిల్లాలో 12 మరణాలు నమోదు కాగా తర్వాత వారంలో ఈ సంఖ్య 128కి పెరిగింది. అదే సమయంలో మలప్పురం జిల్లాలో 70 మరణాలు నమోదు కాగా తర్వాత వారంలో 109కి పెరిగినట్లు పేర్కొంది.

కాగా, డిసెంబర్ 3తో ముగిసిన నెలలో కేరళలో మొత్తం 1,71,521 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 55 శాతానికి పైగా ఇక్కడే నమోదయ్యాయి. నవంబర్ 26తో ముగిసే వారానికి కేరళలో మరణాల సంఖ్య 1,890 ఉండగా డిసెంబర్‌ 3తో ముగిసిన వారానికి ఈ సంఖ్య 2,118కి పెరిగినట్లు కేంద్రం గుర్తించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు శనివారం లేఖలు రాశారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల కలిగే ప్రమాదంపై అప్రమత్తం చేశారు.

బూస్టర్ డోసుల కన్నా 2 డోసుల పూర్తి ముఖ్యం

ఇలా ఉండగా, ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో బూస్టర్ డోసులకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని కేరళ, రాజస్థాన్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ బూస్టర్ డోసును వినియోగించడానికి గురువారం భారత్ ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి పొందింది. 
 
అయితే, బూస్టర్ డోసు వినియోగం తప్పనిసరి అని నిర్ణయించడానికి శాస్త్రీయపరమైన కారణాలను పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం అందరికీ టీకా రెండు డోసులు పూర్తి చేయడమే ప్రధాన లక్షంగా కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం 36 దేశాలు బూస్టర్ డోసులను ఇవ్వడం ప్రారంభించాయి. అయితే ప్రపంచంలో అత్యంత దుర్బలమైన ప్రజలందరికీ పూర్తిగా వ్యాక్సిన్ అందించడం తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేస్తోంది.
 
ఈనేపథ్యంలో వైద్య నిపుణులు బూస్టర్ డోసుల కోసం సలహా ఇవ్వడం కన్నా ఇంకా వ్యాక్సిన్ పొందని వారికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం, దీంతోపాటు కొవిడ్ నిబంధనలు పాటించడం, మాస్క్‌లు ధరించడం, చాలా అవసరమని తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
 
టీకాల సామర్ధ్యాన్ని విశ్లేషించండి 
 
మరోవంక, దేశంలో ఒమిక్రాన్‌ భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని విశ్లేషించాల్సిన అవసరమున్నదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (హెల్త్‌) కేంద్రప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఓ నివేదికను సమర్పించింది. 
 
రోగనిరోధకశక్తి నుంచి కొత్త వేరియంట్‌ సులభంగా తప్పించుకుంటున్నదన్న నివేదికలను ఉటంకిస్తూ.. ఈ అంశంపై లోతుగా పరిశోధన చేయాల్సి ఉన్నదని, ప్రజలకు బూస్టర్‌ డోసు ఇవ్వడంపైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని సిఫారసు చేసింది. 
 
తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో కొవిడ్‌ సెకండ్‌వేవ్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది. దవాఖానలో పడకలు, ఆక్సిజన్‌ సరఫరా సిలిండర్లు, ఔషధాలను తగిన మోతాదులో సిద్ధం చేయాలన్నది.