బిట్ కాయిన్‌ కు ఒమిక్రాన్ గండం!

గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ విల‌విల్లాడుతున్న సమయంలో  మెరుపులు మెరిపించిన క్రిప్టో క‌రెన్సీ మేజ‌ర్ బిట్ కాయిన్‌ ఇప్పుడు న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్  తో అల్లాడుతున్న‌ది. బిట్ కాయిన్‌తోపాటు ఇత‌ర క్రిప్టో క‌రెన్సీ కాయిన్‌లు భారీగా న‌ష్ట‌పోయాయి. 

సింగ‌పూర్‌లో శ‌నివారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ 11 శాతం న‌ష్ట‌పోయింది. 42,296 డాల‌ర్ల దిగువ‌కు ప‌డిపోయిన బిట్ కాయిన్ మ‌ధ్యాహ్నం 1.50 గంట‌ల‌కు 47,600 వ‌ద్ద‌కు చేరుకున్నది.క్రిప్టోల్లో రెండో స్థానంలో ఉన్న ఎథిరియం 17.4 శాతం న‌ష్ట‌పోయి తిరిగి 10 శాతం న‌ష్టాన్ని పూడ్చుకున్న‌ది.

శ‌నివారం ఒక్క‌రోజే క్రిప్టో క‌రెన్సీ విలువ 2.2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు న‌ష్ట‌పోయింద‌ని ట్రాక‌ర్ కాయిన్‌జెకో పేర్కొంది. గ‌త‌నెల 10న 68,950 డాల‌ర్ల‌తో ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పిన బిట్ కాయిన్ విలువ సుమారు 21వేల డాల‌ర్లు ప‌డిపోయింది. ఒమిక్రాన్ ప్ర‌భావంపై స్ప‌ష్ట‌మైన అంచ‌నాలు లేక‌పోవ‌డంతో మార్కెట్‌లో అస్థిర‌త నెల‌కొంది.

ఇంత‌కుముందు ఆర్థిక అస్థిర‌త‌ల వేళ క్రిప్టో క‌రెన్సీలు పుంజుకునేవి. కానీ ఒమిక్రాన్‌పై ఆందోళ‌న‌తో ఇన్వెస్ట‌ర్లు ఒత్తిడికి గుర‌వుతున్న‌ట్లు స‌మాచారం.కానీ ఇత‌ర ఆస్తులు, మ‌దుపు ప‌థ‌కాల‌తో పోలిస్తే క్రిప్టోల్లో పెట్టుబ‌డుల‌తో ఎక్కువ‌గానే రాబ‌డి వ‌చ్చింది. ఇప్ప‌టికే బిట్ కాయిన్‌ను చ‌ట్ట‌బ‌ద్ధ క‌రెన్సీగా గుర్తించిన ఎల్ సాల్వెడార్‌  దాని ధ‌ర త‌గ్గ‌డంతో మరికొన్ని నాణాలు కొనుగోలు చేసింది.

ఇలా ఉండగా,  క్రిప్టో క‌రెన్సీ లావాదేవీలు, వాటిపై నిషేధం, నియంత్ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై వ‌స్తున్న వ‌దంతుల‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అసహనం వ్యక్తం చేశారు. క్రిప్టో క‌రెన్సీల‌పై ఇంత భారీ స్థాయిలో వ‌దంతులు రావ‌డం అంద‌రికీ ఆరోగ్య‌క‌రం కాద‌ని ఆమె హితవు చెప్పారు. అన్ని వ‌ర్గాల‌తో సంప్ర‌దించిన త‌ర్వాత‌.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన త‌ర్వాతే క్రిప్టో క‌రెన్సీ బిల్లును పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పిస్తామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.