నాగాలాండ్‌లో మిలిటెంట్లనుకొని స్థానికులపై కాల్పులు

నాగాలాండ్‌లో మిలిటెంట్లనుకొని స్థానికులపై కాల్పులు

నాగాలాండ్‌లోని  మోన్‌ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి మోన్‌ జిల్లాలోని ఓటింగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులనే అనుమానంతో భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపాయి. దీంతో 13 మంది మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికుల సమాచారం ప్రకారం.. ఘటనా స్థలంలో ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, కాల్పుల ఘటనపై ఆగ్రహంతో భద్రతా బలగాల వాహనాలను ప్రజలు తగులబెట్టారు. 

స్థానిక మీడియా కథనం ప్రకారం, నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  మోన్ జిల్లాలోని ఓటింగ్-టిరు గ్రామాల మధ్యలో ఈ ఆపరేషన్ జరుగుతుండగా, రోజు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం కూడా అక్కడికి చేరింది. అదే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు రోజు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 

కాల్పుల ఘటనను నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయిఫియు రియో  తీవ్రంగా ఖడించారు. దీనిపై విచారణ చేయడానికి తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని  ఏర్పాటు చేస్తున్నానని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అన్నివర్గాల ప్రజలు శాంతించాలని, ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు చట్టపరంగా న్యాయం చేస్తామని చెప్పారు.

నాగాలాండ్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుందని, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.