కేంద్ర నిధులతో పథకాలకు జగన్ పేర్లపై అభ్యంతరం 

కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న పోషణ్‌ అభియాన్ వంటి పథకాలకు రాష్ట్రాలు తమకు నచ్చిన పేర్లు పెట్టుకోవడం కుదరదని కేంద్రం  స్పష్టం చేసింది. కేంద్ర పథకాలకు ఏపీలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు అని పేర్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 

దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రఘురామ ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.2021-22కి సంబంధించి ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌ పథకాలకు ఇచ్చిన రూ.187 కోట్ల లెక్క చూపాలని ఇందులో ఇరానీ కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు మార్చిన పేర్లు, వాటి కోసం తీసుకున్న చర్యలపై ఓ నివేదిక పంపాలని ఆదేశించినట్లు ఎంపీ రఘురామరాజుకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

వాస్తవానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచీ కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి తమవిగా చెప్పుకుని అమలు చేసుకోవడంపై బీజేపీ మండిపడుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్ధితి కొనసాగుతుందని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. 

అయినా ప్రభుత్వం మాత్రం ఈ విమర్శల్ని పట్టించుకోవడం లేదు. దీంతో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రంగంలోకి దిగారు. ఆయన లేఖకు మాత్రం కేంద్రం స్పందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ఇలా ఉండగా, కేంద్రం నుంచి విడుదల అవుతున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, కేంద్ర పథకాలకు ఇతరుల పేర్లను పెడుతూ వాడుకుంటున్నారని విజయవాడలో జరిగిన రాష్ట్ర బిజెపి కోర్ కమిటీ సమావేశం  ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం విడుదల చేస్తున్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర నిధులను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని ధ్వజమెత్తింది. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతామని స్పష్టం చేస్తూ  రాష్ట్రంలో పరస్పర దూషణలు తప్ప అభివృద్ధిపై దృష్టి లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలోని అవినీతి ప్రజలకు అర్థమైందని వారు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక, మట్కా, గుట్కా, గంజాయి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆరోపించారు.

కాగా,  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు వ్రాసిన లేఖలో  కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ తమ పథకాలకు  రాష్ట్ర సీఎం పేరుతో నామకరణం చేయడంపై   ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం పేర్లు పెట్టడం సరికాదని తప్పుబట్టారు. 

కేంద్రం సూచించిన విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం పెట్టిన పేర్లు తొలగించాలని ఆయన తన లేఖలో కోరారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు నిలిపివేసే అవకాశం ఉందని హెచ్చరించారు.  దీనిపై గత నెల 10న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ప్రజాధనం వృధాకావొద్దనే తాను లేఖ ఆయన ఈ సందర్భంగా తెలిపారు.