ఏడేళ్లలో రూ.38,000 కోట్ల `రక్షణ’ ఎగుమతులు

గత ఏడేళ్లలో దేశం నుంచి రూ.38,000 కోట్లకుపైగా విలువైన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. వైమానిక, రక్షణరంగాల్లో రూ.85,000 కోట్ల ఉత్పత్తులపై అంచనాలున్నాయని, ప్రైవేట్ సెక్టార్ నుంచి రూ.18,000 కోట్ల అంచనాలున్నాయని రాజ్‌నాథ్న్నాపేర్కొరు. 
 
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్‌ఎంఇ) ఆధ్వర్యంలో నిర్వహించిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్షరర్స్(ఎస్‌ఐడిఎం) కాన్‌క్లేవ్‌లో రాజ్‌నాథ్ ప్రసంగించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా దేశ రక్షణ వ్యవస్థ బలోపేతమవుతుందని ఎంఎస్‌ఎంఇలకు రాజ్‌నాథ్ సూచించారు.
 
 ‘మీరు నూతన సాంకేతికతలు, ఉత్పత్తులు తేగలరు. మీరు చిన్నవాళ్లుగా భావించుకొని పెద్ద ఆవిష్కరణలు సాధ్యం కావని అనుకోవద్దు’ అంటూ రాజ్‌నాథ్ వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. ప్రభుత్వ చొరవతో రక్షణ పరిశ్రమలోకి దాదాపు 12,000 ఎంఎస్‌ఎంఇలు చేరాయని రాజ్‌నాథ్ తెలిపారు. 
 
రక్షణ రంగంలో స్టార్టప్‌ల సంఖ్య పెరిగిందని, రక్షణ ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రక్షణ పరికరాల దిగుమతిదారుగా ఉన్న దేశం ఇకనుంచి ఎగుమతిదారుగా మారుతుందని రాజ్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అమేథీలో 5 లక్షల ఎకె-203 రైఫిల్స్ తయారీ
ఇలా ఉండగా,  రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అమేథీలోని కోర్వాల వద్ద ఐదు లక్షల ఎకె-203 రైఫిల్స్‌ను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ రంగానికి చెందిన ఆయుధాల తయారీ హబ్‌గా ఉత్తర్ ప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 
 
రక్షణ రంగంలో విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి స్వస్తి చెప్పి మేకిన్ ఇండియాగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమని వర్గాలు తెలిపాయి. రష్యా భాగస్వామ్యంతో ఎకె-203 రైఫిల్స్ తయారీ జరుగుతుందని, రక్షణ రంగంలో భారత్-రష్యా మధ్య భాగస్వామ్యం బలపడేందుకు ఇది దోహదపడుతుందని వారు చెప్పారు.
 
ఈ ప్రాజెక్టు వివిధ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఇ) ముడి సరుకులు, విడి పరికరాల సరఫరా చేయడానికి వ్యాపార అవకాశాలు కల్పిస్తుందని, అంతేగాక కొత్త ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని వారు తెలిపారు.
 
7.62X39ఎంఎం క్యాలిబర్‌తోకూడిన ఎకె-203 రైఫిల్స్ ప్రస్తుతం భద్రతా దళాల వాడుకలో ఉన్న ఐఎన్‌ఎస్‌ఎఎస్ రైఫిల్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు వారు చెప్పారు. ఇండో-రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ పేరిట ఏర్పాటు చేసిన స్పెషల్ పర్సస్ జాయింట్ వెంచర్‌లో ఈ ప్రాజెక్టు అమలు జరుగుతుంది.