`అన్నమయ్య’ కొట్టుకుపోయిన పాపం జగన్ ది కాదా!

ఇటీవలి వరదలకు కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి బాధ్యత ఎవరిదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రశ్నించారు. ఈ బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది కాదా అని నిలదీశారు. దేశంలో ఆనకట్టల భద్రతకు బిల్లును ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను  ఈ ప్రమాదం సూచిస్తోందని పేర్కొన్నారు. 

రాజ్యసభలో ఆనకట్టల భద్రత బిల్లుపై గురువారం జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ  రాజంపేట వద్ద అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోవడంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లిన విషయాన్ని ప్రస్తావించారు.

 “ ప్రాజెక్టులోకి ఒక్కసారిగా భారీగా నీరు వచ్చింది. దాని సామర్థ్యం కంటే దాదాపు ఒకటిన్నర రెట్లు నీరు అధికంగా  ప్రవహించింది. అప్పుడు స్పిల్‌ వేతో పాటు గేట్లు కూడా తెరిచి.. వచ్చిన వరదను వచ్చినట్లు బయటకు పంపాల్సింది. కానీ ఆ ఐదు గేట్లలో ఒక గేటు తెరుచుకోలేదు. ఎందుకంటే అది పనిచేయడం లేదు” అని కేంద్ర మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.

చాలా బాధతో ఈ విషయం చెబుతున్నానని పేర్కొంటూ దీనికి బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు.   రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? అని నిలదీశారు. దీని ప్రభావం చాలా దూరం పోయిందని అంటూ  ‘ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంత మంది ఆస్తులను పోగొట్టుకున్నారు? భారతదేశంలో మరో ఆనకట్ట తెగిపోయిందని ప్రపంచం అంటుంటే..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

 ప్రపంచవ్యాప్తంగా డ్యాముల భద్రతపై పనిచేసే ఇంజనీర్లు, నిపుణులు కూర్చుని, భారత్‌లో ఇలా మరో ఆనకట్ట కూలిందని చర్చించుకుని, దీనిని ఓ కేస్‌ స్టడీలా తీసుకోవడమంటే.. అది యావజ్జాతికే తలవంపులు తెచ్చే విషయం కాదా? అని షెకావత్  ప్రశ్నించారు.

 డ్యాముల భద్రతలో ఎవరి బాధ్యతలు ఏమిటన్నది జవాబుదారీతనాన్ని నిర్ణయించే ఓ వ్యవస్థను ఓ చట్టం ద్వారా మనమెందుకు రూపొందించుకోకూడదని ఆయన అడిగారు. గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో లార్జీ జల విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి ఉన్నట్లుండి బియాస్‌ నది నీరు విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయి మరణించినన హృదయ విదారక ఘటనను కూడా ఆయన గుర్తుచేశారు.

 రాష్ట్రాలు తమ పరిధుల్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావని షెకావత్‌ స్పష్టం చేశారు.