రాజకీయాలకు ఇక కమల్ హాసన్ దూరం!

వరుస ఎన్నికల పరాజయాలు, మరోవంక సహకరించని ఆరోగ్యంతో ప్రముఖ తమిళ నటుడు,  మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ఇక రాజకీయాలకు దూరమయ్యే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి.  పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీకి కొద్దిపాటి ఓట్లు లభించినా ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో స్వయంగా ఓటమి చెందడమే కాకుండా, ఒక్క సీట్ కూడా గెలుపొందలేక పోయారు. పైగా ఓట్లశాతం బాగా తగ్గిపోయింది.
మరోవంక, ఆ తర్వాత  ఇటీవల తొమ్మిది జిల్లాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సహితం తీవ్ర ఆశాభంగం కలిగింది. రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారింది. ఈ లోగా వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న మునిసిపల్ ఎన్నికలలో కూడా పార్టీని సమాయత్తం చేయలేక పోతున్నారు. పలువురు నేతలు వరుసబెట్టి పార్టీని వీడుతున్నారు.
ఇటువనీత్ సమయంలో కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.  పోరూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొంది కోలుకున్న కమల్‌హాసన్‌ ఈ నెల నాలుగున డిశ్చార్జి అవుతున్నారు. ఆ తర్వాత కనీసం పదిహేను రోజుల పాటు ఆయన ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకోవలసి ఉంది. శని, ఆదివారాలు మాత్రం ఎప్పటివలెనే తమిళ బిగస్‌బాస్‌ వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ప్రస్తుతం కమల్‌హాసన్‌ అస్వస్థత కారణంగా సినిమాల్లో సహితం  సక్రమంగా నటించలేకున్నారు. స్వంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ‘విక్రమ్‌’ సినిమా షూటింగ్‌ కూడా అర్థాంతరంగా ఆగిపోయింది. దానితో  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కమల్‌హాసన్‌ రాజకీయాలకు దూరంకాక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
 గత నెల రోజులుగా పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించకపోవడంతో కార్యకర్తలు నిరాశచెందుతున్నారు. రాష్ట్రంలో అనుకున్న విధంగా ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలదొక్కుకోలేక పోతున్నారు. దానితో ఆయన నాయకత్వం సామర్థ్యంపై మద్దతుదారులలోనే అసంతృప్తి ఏర్పడుతున్నది.
కాగా, కమల్‌హాసన్‌ పార్టీని ప్రారంభించనప్పుడే తానికపై ప్రజాసేవకే అధిక ప్రాధాన్యతనిస్తానని సుస్పష్టంగా ప్రకటించారని, ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనప్పుడు కూడా ప్రజలకు దూరమయ్యే ప్రసక్తేలేదని తెలిపారని మక్కల్‌ నీదిమయ్యం ప్రచార విభాగం నాయకుడు మురళీ అబ్బాస్‌ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ప్రజల కోసం మంచి చేయాలనే తపించే కమల్‌హాసన్‌ ఉన్నట్టుండి రాజకీయాలకు దూరం అయ్యే ప్రసక్తి లేదని, ఒక వేళ ఆరోగ్య కారణాల వల్ల పార్టీ రాజకీయాలకు కాస్త విరామం ప్రకటించే అవకాశమే ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కమల్‌ రాజకీయాల గురించి ఎటువంటి ప్రకటన చేస్తారన్న ఆసక్తి నెలకొన్నది.