మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఇక లేరు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య (89) కన్నుమూశారు. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య శనివారం ఉదయం నిద్రలోనే మృతి చెందారు.  వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆదివారం అంత్యక్రియలు జరుగనున్నాయి. 

రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో విద్యార్థి సంఘ నేతగా వ్యవహరించారు. ఆచార్య ఎన్జీ రంగా శిష్యరికంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆయన నిర్వహించిన రాజకీయ పాఠశాలలో శిక్షణ పొందారు. అందుకనే రాజకీయ, సామజిక, ఆర్ధిక అంశాలపై సాధికారికంగా మాట్లాడగలుగుతుండేవారు. \

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా రోశయ్య సేవలందించారు. 1968, 74, 80లలో శాసనమండలి సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు రహదారులశాఖ, రవాణాశాఖా మంత్రిగా పనిచేశారు. 1989, 2004లలో చీరాల నుండి అసెంబ్లీకి, 1998లో నరసరావుపేట నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోమ్ శాఖ నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 

ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. మొత్తం 18 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించారు.   వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత అంటే 3 సెప్టెంబర్ 2009-25 జూన్ 2011 వరకూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలు చేపట్టారు. ఆగస్ట్ 2011 నుంచి ఆగస్ట్ 2016 వరకూ తమిళనాడుకు గవర్నర్‌గా రోశయ్య పనిచేశారు. 

ప్రజా జీవనంతో పరిణితి చెందిన రాజకీయ వేత్తగా పేరొందారు. మర్యాదగా అందరిని పలకరించడం, అన్ని పక్షాల వారితో సామరస్యంగా వ్యవహరించడం ద్వారా వివాదాలకు అతీతంగా ఉండేవారు. పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో కీలకంగా వ్యవహరించారు. 

రోశయ్య మృతి పట్ల ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మృతదేహం వద్ద నివాళులు అర్పించి, ఆయన కుటుంభ సభ్యులను పరామర్శించారు. 

శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఆయన వాగ్ధాటికి తగ్గుకోవడం కష్టమని గ్రహించి 1978 తర్వాత అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆయనను అధికార పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చారు. 1983లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన టిడిపి అధినేత రోశయ్యను ప్రతిపక్ష నేతగా తగ్గుకోవడం కష్టమని గ్రహించి శాసన మండలిని రద్దు చేశారు. 

 ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.