భారత్ లో ఒమిక్రాన్ కేసుల న‌మోదు ప్రారంభం

భారత్ లో ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ల‌వ్ అగర్వాల్ తెలిపారు.  ఆ రెండూ క‌ర్నాట‌క‌లోని బెంగళూరులో న‌మోదు అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. జీనోమ్ ప‌రీక్ష‌ల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న‌ట్లు ద్రువీక‌రించామ‌ని పేర్కొన్నారు. 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా 29 దేశాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 373 మందికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న‌ట్లు గుర్తించార‌ని ఆయన చెప్పారు. భారత్ లో 66, 46 ఏళ్లు ఉన్న ఇద్ద‌రికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. 
కాగా, కేంద్ర ఆరోగ్య‌శాఖ ఆధీనంలో ఉన్న 37 ల్యాబ్‌ల ఇన్‌సాకాగ్ కాన్సార్టియ‌మ్ చేప‌ట్టిన జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించామ‌ని ఐసీఎంఆర్ డీజీ బ‌ల్‌రామ్ భార్గ‌వ్‌ తెలిపారు.  ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, కానీ అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి ఆయన పేర్కొన్నారు.
స‌రైన కరోనా ప్ర‌వ‌ర్త‌నానియ‌మావ‌ళి పాటించాల‌ని భార్గ‌వ్ చెప్పారు. ఒమిక్రాన్ పాజిటివ్ వ‌చ్చిన క‌ర్నాట‌క వాసుల కాంటాక్ట్‌ల‌ను గుర్తించామ‌ని, వారిని మానిట‌ర్ చేస్తున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది. ప్రోటోకాల్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని అగ‌ర్వాల్ తెలిపారు.

హై రిస్క్ ఉన్న దేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికులు ఆర్‌టీ-పీసీఆర్ ప‌రీక్ష‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా చేయించుకోవాల‌ని కేంద్రం వెల్ల‌డించింది. ఒక‌వేళ ఎవ‌రైనా పాజిటివ్ తేలితే వారికి క్లినిక‌ల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం చికిత్స‌ను అందించ‌నున్నారు. ఒక‌వేళ నెగ‌టివ్ వ‌స్తే, వారికి ఏడు రోజుల హోం క్వారెంటైన్ ఉంటుంద‌ని ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో తీవ్ర ల‌క్ష‌ణాలు ఏమీ రిపోర్ట్ కాలేద‌ని అగ‌ర్వాల్ చెప్పారు. అన్ని ఒమిక్రాన్ కేసుల్లో స్ప‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచంలో కానీ, దేశంలో కానీ ఆ కేసుల్లో తీవ్ర ల‌క్ష‌ణాలు న‌మోదు కాలేద‌న్నారు. అయితే ఆ వేరియంట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

ప్ర‌తి ఒక్క‌రూ పూర్తిగా వ్యాక్సినేట్ కావాల‌ని నీతి ఆయోగ్ స‌భ్యుడు వీకే పౌల్ కోరారు. దేశ‌వ్యాప్తంగా 49 శాతం వ‌యోజ‌నుల‌కు రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తి అయ్యింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రెండ‌వ డోసు తీసుకుంటున్న‌వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ట్లు  ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.

ఐరోపా దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచంలో దాదాపు 70 శాతం కేసులు అక్క‌డే ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. గ‌డిచిన వారంలో కేవ‌లం ఐరోపాలోనే 70 శాతం కేసులు న‌మోదు అయిన‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్ చెప్పారు. భారత్ లో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లో స‌గ‌టున ప‌దివేల యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దేశంలో న‌మోదు అవుతున్న కేసుల్లో 55 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.