జాతీయ గీతాన్ని అవమానించిన మమతా!

జాతీయ గీతాన్ని అవమానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ముంబై బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసంపూర్ణంగా జాతీయ గీతాన్ని ఆలపించి, అవమానించారంటూ సీఎం మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ కూడా విమర్శలు గుప్పించింది. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారని ఆరోపిస్తూ బీజేపీ నేత కేసు పెట్టాడు. కూర్చున్న భంగిమలో జాతీయగీతాన్ని ఆలపిస్తూ, ఆపై 4 లేదా 5 శ్లోకాల తర్వాత అకస్మాత్తుగా ఆపివేశారని ముంబై బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

ముంబైలో విలేకరుల సమావేశంలో పాల్గొంటూ  జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న మమతా బెనర్జీ గీతం పూర్తి చేయకుండా మధ్యలో కూర్చున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ‘‘మొదట కూర్చున్న మమతా బెనర్జీ ఆ తర్వాత లేచి నిలబడి భారత జాతీయ గీతాన్ని సగంలో పాడటం మానేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా మమతా బెంగాల్ సంస్కృతిని, జాతీయ గీతాన్ని, దేశాన్ని, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను అవమానించారు’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ ట్వీట్ చేసింది.

“మన జాతీయతకు ఒక శక్తివంతమైన ప్రదర్శన మన జాతీయ గీతం. కనీసం అధికార పదవులలో ఉన్న నాయకులు దానిపట్ల గౌరవం చూపకపోయినా, అగౌరవం ప్రదర్శించరాదు. జాతీయ గీతం పట్ల మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు చూస్తుంటే మన దేశంలోని ప్రతిపక్షాలు మన దేశం పట్ల గౌరవం, దేశభక్తి ప్రదర్శించడానికి వెనుకాడుతున్నారా?” అంటూ బిజెపి ఐటి సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.

ముంబయిలో జరిగిన సభలో బెంగాల్ సీఎం మమతా జాతీయ గీతాన్ని అవమానించారు. ఆమెకు మర్యాద తెలియదా లేదా ఆమె తెలిసి అవమానించారా? అని ప్రశ్నిస్తూ  బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షురాలు డాక్టర్ సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు. మమతాబెనర్జీపై ముంబై బీజేపీ నేత ప్రతీక్ కర్పే మండిపడ్డారు. జాతీయ గీతంపై మమతా బెనర్జీ ప్రవర్తన సిగ్గుచేటు అంటూ ధ్వజమెత్తుతూ బీజేపీకి యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్టీ ఎంపీ  తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు.