ఎంఎస్‌పీపై కమిటీకి రైతు ప్రతినిధులను కోరిన కేంద్రం

వ్యవసాయ చట్టాలను రద్దుచేసినా ఇంకా రైతు సంఘాలు లేనేట్టుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) తదితర అంశాలపై చర్చ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఆ కమిటీ సభ్యులుగా సంయుక్త కిసాన్‌ మోర్చా  నుంచి ఐదుగురి పేర్లను ప్రతిపాదించాలని కేంద్రం కోరిందని రైతు సంఘం నేత దర్శన్‌పాల్‌ తెలిపారు. 

రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న మేరకు మూడు వ్యవసాయ చట్టాలను  పార్లమెంట్‌లో రద్దు చేసిన అనంతరం కేంద్రం నుంచి ఈ పిలుపు వచ్చింది. అయితే తాము ఇంకా పేర్లను నిర్ణయించలేదని దర్శన్‌పాల్‌ చెప్పారు.  డిసెంబర్‌ 4న జరిగే సమావేశంలో పేర్లపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

. ‘రైతులు పండించే పపంటలకు కనీస మద్దతు ధరపై చర్చించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో చేర్చడం కోసం ఐదుగురి పేర్లను ఇవ్వాలని కేంద్రం ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చాను అడిగింది. ఈ పేర్లను మేము ఇంకా నిర్ణయించలేదు. డిసెంబర్ 4న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం’ అని దర్శన్ పాల్ చెప్పారు.

భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం కోసం మోర్చా అత్యవసర సమావేశం బుధవారం జరుగుతుందని పంజాబ్‌కు చెందిన రైతు సంఘాలు సోమవారం చెప్పడం తెలిసిందే. అయితే ఈ సమావేశం ఇంతకు ముందు ప్రకటించినట్లుగా బుధవారం కాక డిసెంబర్ 4న జరుగుతుందని ఎస్‌కెఎం వివరణ ఇచ్చింది.

 40కిపైగా ఉన్న రైతు సంఘాలకు సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చట్టాల రద్దు, ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీతో పాటు పలు డిమాండ్లు కేంద్రం ముందుంచిన విషయం తెలిసిందే.

జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా పంటల విధానాలను మార్చడం, ఎంఎస్‌పీని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చడం తదితర అంశాలపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ జాతినుద్దేశించి చేసిన ప్రసంగించిన సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు.