రైతుల మ‌ర‌ణాల‌ రికార్డులు లేవు

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఏడాదిపాటు జ‌రిగిన ఆందోళ‌నల్లో మ‌ర‌ణించిన 750 మంది రైతుల‌కు ఆర్థిక సాయం అందించ‌డం కుద‌ర‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసింది. ఆందోళ‌న‌ల్లో మ‌ర‌ణించిన రైతులకు రూ.25 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తున్నారా లేదా..? అని ప్ర‌తిప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ రాత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేస్తూ మ‌ర‌ణించిన రైతుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డులు లేవ‌ని, కాబ‌ట్టి వారికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డం సాధ్యం కాద‌ని కేంద్ర మంత్రి తోమ‌ర్‌ త‌న రాత‌పూర్వ‌క స‌మాధానంలో పేర్కొన్నారు. రికార్డులు లేనందున ప్ర‌తిప‌క్షాలు ఇక‌పై ఆ ప్ర‌స్తావ‌న తేవొద్ద‌ని మంత్రి కోరారు.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వద్ద దీనికి సంబందించిన రికార్డు లేదని, అందువల్ల మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడమనే ప్రశ్న తలెత్తదని తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో చేపడుతోన్న ఆందోళనలను ఆపాలని తాము రైతు సంఘాలను పలుమార్లు కోరామని.. వ్యవసాయ చట్టాలపై 11 సార్లు చర్చలు కూడా జరిపామని పేర్కొన్నారు.

మరోవైపు రైతుల పంటకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేస్తారా? అని ఓ ఎంపి ప్రశ్నించగా.. 22 రకాల పంటలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందని మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సమాధానమిచ్చారు. ఈ ఉద్యమంలో చనిపోయిన 750 మందికి రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

ఇదిలావుండగా రైతు సంఘాలు చెప్తున్నదాని ప్రకారం, 2020 నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజీపూర్‌ వద్ద రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటున్నారు. 

తట్టుకోలేని వాతావరణం, అపరిశుభ్ర పరిసరాల వల్ల అనారోగ్యానికి గురికావడం, ఆత్మహత్యల వల్ల ఈ మరణాలు సంభవించాయని  చెబుతున్నారు. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నాయి.

మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ రైతు సంఘాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, నిరసనల నేపథ్యంలో తమపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, నిరసనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలను కొనసాగిస్తామని చెప్తున్నాయి.