ఎంపీల సస్పెన్షన్లపై పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం

12 మంది ఎంపీల సస్పెన్షన్‌ వేటుపై రాజ్యసభలో, లోక్‌సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ  12 మంది ఎంపీల సస్పెన్షన్‌ నిబంధనలకు విరుద్ధమని, ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరోవైపు ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు సస్పెన్షన్‌ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. విపక్ష నేతల విజ్ఞప్తిని తిరస్కరించారు. నిరసన తెలుపుతున్న ఎంపీలంతా కూర్చోవాలని కోరారు. సభ్యుల ప్రవర్తనపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం సభకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

“ఒకసారి వర్షాకాల సమావేశాల చివరిరోజు రికార్డులను పరిశీలించండి. మీరు సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు” అంటూ  ఛైర్మన్‌ అసహనం వ్యక్తం చేశారు. అలాగే సభ్యులు తమ ప్రవర్తనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో, వారి అప్పీల్‌ పరిశీలనకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. విపక్ష నేతల అప్పీల్‌ను వెంకయ్యనాయుడు తిరస్కరించడంతో వారు సభ నుంచి వాకౌట్‌ చేశారు. టిఎంసి మాత్రం సభలోనే ఉండిపోయింది.

ఇలా ఉండగా,  ఎంపీలు క్షమాపణలు చెబితే.. వారిపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎన్నో కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని, దానికి విపక్ష సభ్యులందరూ ఆరోగ్యకరమైన చర్చలో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

అలాగే ప్రభుత్వం కూడా.. నియమావళి ప్రకారం ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.  విపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంటూ కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్టు దానికి సభ హుందాగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలని మంత్రి జోషి కోరారు.

మరోవైపు విపక్ష నేతలు ఈరోజు పార్లమెంటులోని మల్లిఖార్జున్‌ ఖర్గే ఆఫీసులో భేటీ అయ్యారు. ఆ నేతల్లో టిఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు కూడా ఉన్నారు. ఈ సమావేశంలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ అంశంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని వాళ్లు చర్చించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, మేం క్షమాపణలు చెప్పమని స్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో ఒకరైన సీపీఐ ఎంపీ బినోరు విశ్వం తెలిపారు.

కాగా, 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ వేటుపై లోక్‌సభలో కూడా సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగింది. సస్పెండ్‌ అయిన సభ్యులకు మద్దతుగా లోక్‌సభకు చెందిన విపక్ష నేతలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేశారు. పలు గందరగోళాల మధ్య లోక్‌ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. వాకౌట్‌ చేసిన సభ్యులంతా పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు.