బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేగింది. బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన ఇద్ద‌రు దక్షిణ  ఆఫ్రికా దేశ‌స్థుల‌కు టెస్ట్ చేయ‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాళ్ల‌ను వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లించారు. వారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో లేదో టెస్ట్ చేసేందుకు వాళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించిన‌ట్టు బెంగళూరు రూర‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ శ్రీనివాస్ వెల్ల‌డించారు. మ‌రో 48 గంట‌ల్లో టెస్ట్ రిజల్ట్స్ వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.

దీనితో వివిధ దేశాల నుంచి వ‌చ్చే అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు కర్ణాటక ప్రభుత్వం బెంగ‌ళూరు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో స్క్రీనింగ్ టెస్ట్‌లు త‌ప్ప‌నిస‌రి చేసింది. విదేశీ ప్ర‌యాణికుల‌కు వారం త‌ప్ప‌నిస‌రి క్వారంటైన్ నిబంధ‌న‌లు అమ‌లులోకి తెచ్చింది. ఈ మేర‌కు శ‌నివారం ముఖ్యమంత్రి  బ‌స్వ‌రాజ్ బొమ్మై నిర్వ‌హించిన ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌లో ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ద‌క్షిణాఫ్రికాతోపాటు బోట్స్‌వానా, హాంకాంగ్‌, ఇజ్రాయెల్ త‌దిత‌ర దేశాల నుంచి వచ్చిన వారి వ‌ద్ద క‌రోనా నెగెటివ్ స‌ర్టిఫికెట్ ఉన్నా మ‌ళ్లీ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని పేర్కొంది. క్వారంటైన్ స‌మ‌యం ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ నెగెటివ్ వ‌చ్చిన త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్లాల‌ని స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం బెంగ‌ళూరుతో పాటు క‌ర్ణాట‌క మొత్తం పోలీసులు, వైద్య సిబ్బంది అల‌ర్ట్ అయ్యారు. ముఖ్యంగా బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న అంత‌ర్జాతీయ ప్రయాణికుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేశాక‌నే బ‌య‌టికి పంపిస్తున్నారు. హైరిస్క్‌లో ఉన్న దేశాల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బెంగ‌ళూరు విమానాశ్ర‌యానికి 584 మంది రాగా, వారిలో 94 మంది ప్ర‌యాణికులు దక్షిణ ఆఫ్రికా నుంచి వ‌చ్చారు. అందులో ఇద్ద‌రికి క‌రోనా సోకిన‌ట్టు తేలింది.

ఇలా ఉండగా, కేర‌ళ‌లో క‌రోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్న‌ది. అక్క‌డ ఇప్ప‌టికీ నాలుగు వేల‌కు త‌గ్గ‌కుండా రోజువారీ కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శనివారం కూడా కొత్త‌గా 4,741 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య అంత‌కంటే ఎక్కువ‌గానే ఉన్న‌ది. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోద‌వుతూనే ఉన్నాయి. తాజాగా  28 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో అక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల‌ సంఖ్య 39,679కి పెరిగింది. క‌రోనా మ‌ర‌ణాలు, రిక‌వరీలు పోను కేర‌ళ‌లో ప్ర‌స్తుతం 48,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.