చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధులు.. కేంద్రం సీరియస్

ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగం విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్ అయింది. ఎంపీ లాడ్స్ నిధుల‌ను చ‌ర్చిల నిర్మాణం కోసం ఖ‌ర్చు చేయ‌డంపై వెంట‌నే నివేదిక పంపాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

బాపట్ల  ఎంపీ నందిగం సురేష్ చ‌ర్చి నిర్మాణానికి రూ.40 ల‌క్ష‌ల‌కు పైగా నిధులు ఇచ్చిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. మీడియా క‌థ‌నాల‌తో ప్ర‌ధాని నరేంద్ర మోదీకి వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు లేఖ వ్రాయడంతో కేంద్రం తీవ్రంగా స్పందించింది. 

ర‌ఘురామ లేఖ‌పై నివేదిక అందించాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి రెండు నెల‌ల క్రితం లేఖ రాసిన కేంద్ర గ‌ణాంకాలు, ప్ర‌ణాళిక శాఖ స్పందించ‌క‌పోవ‌డంతో మ‌రో లేఖ రాశారు. 

కాగా, ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుందని రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తెస్తున్నారని తప్పుబట్టారు. దేశంలో ఇంతలా అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు. 

కాగ్ సైతం అప్పుల‌పై త‌ల‌లు ప‌ట్టుకుని ఏపీని వ‌దిలేసే ప‌రిస్థితి వ‌చ్చిందని ఎద్దేవా చేశారు . ఆర్థిక విధ్వంసంపై ప్ర‌ధాని, ఆర్బీణ బ్యాంక్ ల‌కు లేఖ‌లు రాస్తాన‌ని ఆయన తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అప్పులు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను బ‌లిప‌శువులు చేయొద్ద‌ని ఆయన కేంద్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. ఎఫ్ ఆర్ బీఎం ప‌రిధి మేర‌కు మాత్ర‌మే అప్పులివ్వాల‌ని స్పష్టం చేశారు.