డిసెంబ‌ర్ 6న భార‌త్‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌

ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ‌చ్చే నెల 6న భార‌త్‌కు రానున్నారు. అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం 6న న్యూఢిల్లీకి చేరుకోనున్న పుతిన్‌.. భార‌త్‌, ర‌ష్యా 21వ వార్షిక స‌ద‌స్సులో పాల్గొన‌నున్నారు. 

ఈసారి వార్షిక స‌ద‌స్సు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ-రష్యా అధ్య‌క్షుడు పుతిన్ మ‌ధ్య జ‌రుగ‌నున్న‌ది. ఈ మేర‌కు భార‌త విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి ఆరింద‌మ్ బాగ్చీ శుక్ర‌వారం ఒక‌ ప్ర‌క‌ట‌న చేశారు. నవంబర్, 2019లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కలుసుకున్న ఈ రెండు దేశాల అగ్రనేతలు ఆ తర్వాత తొలిసారిగా వ్యక్తిగతంగా కలుసుకోనున్నారు. 

గత రెండేళ్లుగా ఈ ఇద్దరు నేతలు ఆరు సార్లు టెలిఫోన్ లలో, వర్చ్యువల్ సమావేశాలలో కలుసుకున్నా కరోనా కారణంగా నేరుగా కలుసుకోలేక పోయారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలను ఈ ఇద్దరు నేతలు సమీక్షించి, వాటిని మరింత పటిష్ట పరచడం గురించి చర్చింప గలరని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. 

అయితే, ప్ర‌ధాని మోదీ- పుతిన్ స‌మావేశానికి ముందు రెండు దేశాల మ‌ధ్య 2+2 డైలాగ్ జ‌రుగుతుంద‌ని విదేశాంగ శాఖ తెలిపింది. రెండు దేశాలకు చెందిన ర‌క్ష‌ణ‌, విదేశాంగ శాఖ మంత్రులు ఈ స‌మావేశంలో పాల్గొంటార‌ని తెలిపారు. ఇటువంటి సమావేశాలను ఇప్పటి వరకు భారత్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లతో మాత్రమే జరిపింది. 

ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రెండు దేశాల మధ్య నెలకొన్న వ్యూహాత్మక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంపై అవసరమైన యంత్రాంగం ఏర్పాటు గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

భార‌త్ త‌ర‌ఫున ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంక‌ర్ హాజ‌రుకానుండ‌గా.. ర‌ష్యా త‌ర‌ఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ ల‌వ్‌రోవ్‌, ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయిగు పాల్గొన‌నున్నారు.గత ఏడాది జరగాల్సిన సదస్సు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పటి వరకు భారత, రష్యాల మధ్య 20 వార్షిక సదస్సులు జరిగాయి.