మార్చి నాటికి మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం!

వచ్చే ఏడాది మార్చిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారుతుందని, బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  నారాయణ్‌ రాణే జోస్యం చెప్పారు. రెండు రోజుల సందర్శనకు రాజస్థాన్‌ వెళ్లిన ఆయన జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ బిజెపి, ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలున్నట్లు సంకేతం ఇచ్చారు.   

‘మహారాష్ట్రలో అతి త్వరలో మార్పు కనిపిస్తుంది. మార్చి నాటికి ప్రభుత్వంలో మార్పు వస్తుంది’ అని వెల్లడించారు. అయితే మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా లేదా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలి గదా అని నర్మగర్భంగా పేర్కొన్నారు. 

దీని గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మాట్లాడారని, ఇది నిజం కాగలదని తాను ఆశిస్తున్నానని రాణే విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారానికి  మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమితో కూడిన మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కానుండడం గమనార్హం. 

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనారోగ్యంతో ఉన్నారని, కాబట్టి ఆయన గురించి ఇప్పుడు మాట్లాడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తమకు చెప్పారని ఆయన తెలిపారు. అయినప్పటికీ మూడు పార్టీల మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రలో ఎక్కువ కాలం మనుగడ సాగించదని రాణే స్పష్టం చేశారు.

రెండు వారాల కింద ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌ వైద్యులు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వెన్నెముకకు సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆయన అనారోగ్యం నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రస్తుత ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని రాణే తెలిపారు.

రెండేళ్ల క్రితం ఏర్పడిన మూడు పార్టీల కూటమి ప్రజల అభీష్టం మేరకు పనిచేయడంలో విఫలం కావడంతో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం అనివార్యమని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రభుత్వం కూలిపోతుందా, కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఏవైనా విడిపోయే అవకాశాలున్నాయా అన్న విషయాన్నీ తాము మీడియా ముందు చర్చింపలేమని తెలిపారు. 

మహారాష్ట్రకు చెందిన బిజెపి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, ఆయన సహచరుడు ప్రఫుల్ పాటిల్ శుక్రవారం ఢిల్లీలో మకాం వేసిన తరుణంలో నారాయణ్ రాణే చేసిన ఈ వ్యాఖ్యలు సరికొత్త ఊహలకు తెరతీశాయి.  

అయితే బిజెపి నేతలు సంస్థాగత అంశాల గురించి అధిష్ఠానంతో చర్చించడం కోసం వెళ్లారని బిజెపి నేత ఒకరు తెలిపారు. శరద్ పవర్ పార్లమెంటరీ కమిటీ సమావేశంపై వెళ్లారని, ఈ పర్యటన వారం క్రితమే ఖరారు అయినదని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. 

ఇలా ఉండగా,  నారాయ‌ణ్ రాణే 17 ఏండ్ల క్రితం శివసేనతో ఉద్ద‌వ్ థాక్రే నాయ‌క‌త్వంతో విభేదించి బీజేపీలో చేరారు. స్వాతంత్ర్యం వ‌చ్చిన తేదీ కూడా గుర్తులేనందుకు తాను ప‌క్క‌న‌ ఉండి ఉంటే ఉద్ద‌వ్ థాక్రే చెంప ప‌గుల‌ కొట్టేవాడినని ఇండిపెండెన్స్ డే వేడుక‌ల సంద‌ర్భంగా నారాయ‌ణ్ రాణే వ్యాఖ్యానించడంతో మ‌హారాష్ట్ర స‌ర్కారు ఆయ‌న‌ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది. ఆ త‌ర్వాత ఆయ‌న బెయిల్‌పై విడుద‌ల‌య్యారు