వర్ధమాన దేశాలుగా నేపాల్, బాంగ్లాదేశ్ 

బంగ్లాదేశ్‌, నేపాల్‌లతోసహా మూడు దేశాలను వర్ధమాన దేశాల కేటగిరీలోకి చేరుస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 76వ వార్షిక సమావేశం చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. లావో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌తో సహా ఈ మూడు దేశాలు ఇప్పటివరకు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు (ఎల్‌డిసి) కేటగిరీలో వున్నాయి.

బంగ్లాదేశ్‌ 1975లో తక్కువ అభివృద్ధి చేందిన దేశాల గ్రూపులో చేరేటప్పటికి ఆ దేశంలో పేదరికం రేటు 83 శాతంగా ఉండేది. కరోనా మహమ్మారి ప్రబలడానికి ముందు అది 20.5 శాతానికి తగ్గింది. లావో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌, నేపాల్‌ కూడా ఈ కాలంలో గణనీయమైన పురోగతి సాధించడంతో వీటిని ఎల్‌డిసి కేటగిరి నుంచి వర్థమాన దేశ హౌదాకు ప్రమోట్‌ చేసినట్లు ఆ తీర్మానం పేర్కొంది. 

కరోనా అనంతర పరిస్థితుల్లో కోలుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తూనే, కరోనా  వల్ల దెబ్బతిన్న ఆర్థిక, సామాజిక నష్టాన్ని పూడ్చుకోవడానికి అవసరమైన విధానాలను, వ్యూహాలను అమలు చేస్తూనే ఈ మూడు దేశాలు ఎల్‌డిసి కేటగిరీ నుండి మారేందుకు సన్నద్ధమవాల్సి వుంటుందని ఆ ప్రకటన పేర్కొంది. అధికారికంగా 2026లో బంగ్లాదేశ్‌ వర్ధమాన దేశంగా మారుతుంది. కరోనా  కారణంగా ఈ పరివర్తనకు అవసరమైన సమయాన్ని మూడేళ్ల నుండి ఐదేళ్లకు పెంచారు.

వర్ధమాన దేశాల గ్రూపులోకి చేరుస్తూ తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర దినోత్సవం, బంగ బంధు శత జయంత్యుత్సవాలు జరుపుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుందని ఐరాసలో బంగ్లాదేశ్‌ శాశ్వత ప్రతినిధి రబాబ్‌ ఫాతిమా ట్వీట్‌ చేశారు. జాతీయ ఆకాంక్ష, ప్రధాని 2021 దార్శనికత దీనితో నెరవేరిందని ఆమె పేర్కొన్నారు. సభ్య దేశాలందరికీ ముఖ్యంగా వర్ధమాన దేశాల భాగస్వాములకు ఫాతిమా కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రస్తుతం ఎల్‌డిసి జాబితాలో 46 దేశాలు వున్నాయి. వర్ధమాన దేశంగా మారాలంటే అమలవ్వాల్సిన నిబంధనల్లో తలసరి ఆదాయం 1230 డాలర్లుగా వుండాలన్నది ఒక నిబంధన అని ఐక్యరాజ్య సమితి తెలిపింది.